Afghanistan Crisis: గందరగోళంలో అఫ్గానిస్తాన్ క్రికెటర్ల భవిష్యత్.. ఆ జట్టు టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా?

అఫ్గానిస్తాన్ క్రికెట్‌లోగందరగోళం.. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడేది అనుమానమే! (PC: ICC)

అఫ్గానిస్తాన్‌ రాజధాని సహా ముఖ్య పట్టణాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం అక్కడ అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెటర్ల భవిష్యత్ ఎలా ఉండబోతున్నది? వాళ్లు ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్ ఆడటానికి వస్తారా?

 • Share this:
  అఫ్గానిస్తాన్‌లో (Afghanistan) తీవ్ర రాజకీయ సంక్షోభం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ దేశం నుంచి అమెరికా తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడంతో తాలిబాన్లు ఏకంగా రాజధాని కాబూల్‌ను కైవసం చేసుకున్నారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. కాగా, రెండేళ్లుగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా తాలిబన్లతో పాటు ఇతర తీవ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ రెండు దశాబ్దాలలో అఫ్గానిస్తాన్‌లో కాస్త స్వేచ్ఛా వాయువులు పీల్చే అవకాశం రావడంతో దేశం పలు విషయాల్లో అభివృద్ది వైపు నడిచింది. బీసీసీఐ (BCCI) సహకారంతో అఫ్గాన్‌లో క్రికెట్‌ను (Afghanistan Cricket) అభివృద్ది చేశారు. ఎంతో మంది యువ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. రషీద్ ఖాన్ (Rashid Khan), మహ్మద్ నబీ (Mohammad Nabi), ముజీబుర్ రెహ్మాన్ (Mujeeb ur Rehman) వంటి క్రికెటర్లు అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌కు సరికొత్త రూపును ఇచ్చారు. టెస్టు క్రికెట్ హోదా కూడా సంపాదించిన అఫ్గానిస్తాన్.. ఇప్పుడిప్పుడే విదేశీ పర్యటనలు చేస్తున్నది. బీసీసీఐ కూడా మన దేశంలోని లక్నో, నోయిడా, డెహ్రడూన్ స్టేడియంలను తాత్కాలికంగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కేటాయించింది. దీంతో వారి దేశంలో పర్యటించడానికి ఇబ్బంది పడుతున్న ఇతర దేశాలను.. ఇండియాలోని ఈ గ్రౌండ్లే వేదికలుగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.

  అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు మొత్తం మారిపోయి తిరిగి తాలిబన్ల చేతిలోకి దేశం వెళ్లిపోయింది. దీందో అక్కడి క్రికెటర్ల భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా తయారయ్యింది. స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నారు. ప్రస్తుతం యూకేలో ఉన్న రషీద్, నబీ అక్కడే ది హండ్రెడ్ లీగ్ ఆడుతున్నారు. అది ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆడటానికి వస్తారా లేదా అనేది సందిగ్దంగా మారింది. వాళ్లు యూఏఈ వెళ్లి ఐపీఎల్ ఆడితే తాలిబన్లు ఊరుకుంటారా అనే ఆందోళన నెలకొన్నది. అంతే కాకుండా అక్టోబర్-నవంబర్ నెలల్లో యూఏఈ, ఒమన్ వేదికగా ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నది. అందులో అఫ్గానిస్తాన్ పాల్గొంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నెల 21న ది హండ్రెడ్ టోర్నీ ముగిసిన తర్వాత గానీ.. వీళ్లు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడే విషయంపై స్పష్టత రానున్నది.

  Afghanistan Cricketers: అఫ్గానిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలిబాన్లు.. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఎక్కడున్నారు?
   అఫ్గానిస్తాన్ క్రికెటర్ల విషయంలో బీసీసీఐ కూడా స్పందించింది. త్వరలో జరగబోయే ఐపీఎల్ 2021 రెండవ దశలో అఫ్గానిస్తాన్ క్రికెటర్లు పాల్గొంటారని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం యూకేలో ఉన్న వారిని అవసరం అయితే టీమ్ ఇండియాతో కలిపి యూఏఈకి తరలించే ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
  Published by:John Naveen Kora
  First published: