Afghanistan Cricket: భయపడుతున్న అఫ్గాన్ క్రికెటర్లు.. ప్రస్తుతం ఆడలేమని వెల్లడి.. సిరీస్ వాయిదా

తీవ్ర భయాందోళనలో అఫ్గాన్ క్రికెటర్లు.. సిరీస్ వాయిదా (PC: Skysports/twitter)

అఫ్గాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశ క్రికెటర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాలిబన్లు క్రికెట్‌కు మద్దతు ఇచ్చినా.. భయంతో తర్వాతి పర్యటనను వాయిదా వేసుకున్నారు.

 • Share this:
  అఫ్గానిస్తాన్‌లో (Afghanistan) తాలిబన్లు (Taliban) రాజ్యాధికారం చేపట్టిన తర్వాత అక్కడ వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. రోజు వారీ జీవనం కూడా అస్తవ్యస్థంగా మారిపోవడంతో ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్ క్రికెటర్లు  కూడా తమ భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ (Rashid Khan, Mohammad Nabi) వంటి అంతర్జాతీయ క్రికెటర్లు తమ దేశాన్ని కాపాడాలని సోషల్ మీడియా సాక్షిగా వేడుకున్నారు. కాగా, గత వారం అఫ్గాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లు తాలిబన్ నేత అనీస్ హక్కానీతో సమావేశం అయ్యారు. అఫ్గానిస్తాన్‌లో క్రికెట్‌కు పునాది వేసిన హక్కానీ.. క్రికెట్ వ్యవహారాలు సజావుగా సాగేందుకు భరోసా ఇచ్చారు. అఫ్గానిస్తాన్ జట్టు తమ తర్వాతి సిరీస్‌లు ఆడటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. క్రికెటర్లు ధైర్యంగా వెళ్లి ఆడటానికి అవసరమైన మద్దతు ఇస్తామని హుక్కాని వెల్లడించారు. దీంతో అఫ్గానిస్తాన్ క్రికెటర్లు (Afghanistan Cricket) కాస్త ఊరట చెందారు. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆ దేశ క్రికెటర్లు పాల్గొనడం ఖాయమే అని వార్తలు వెలువడ్డాయి. కాగా, హుక్కానీ భరోసా ఇచ్చి రెండు రోజులు గడవక ముందే అఫ్గానిస్తాన్ జట్టు తమ తర్వాతి పర్యటనను రద్దు చేసుకున్నది.

  షెడ్యూల్ ప్రకారం అఫ్గానిస్తాన్ జట్టు సెప్టెంబర్ నెలలో శ్రీలంక వేదికగా పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉన్నది. అయితే దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా క్రికెటర్లు చాలా భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం సరిగా లేదని.. వాళ్లు చాలా కుంగిపోయి ఉన్నారని అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రస్తుతం విదేశాలకు ప్రయాణించే వీలు కూడా లేదని.. అన్ని రకాల విమాన సర్వీసులు ఆగిపోవడం ఆటగాళ్లను వేరే మార్గంలో పంపే వీలు కూడా లేదని అధికారి అన్నారు. పాకిస్తాన్‌తో సిరీస్‌ను పాక్‌లోనే నిర్వహించాలని తొలుత భావించారు. కానీ అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ ఆడే పరిస్థితిలో లేరని.. మానసికంగా చాలా ఆందోళన చెందుతున్నట్లు అధికారి చెప్పారు. అయితే టీ20 వరల్డ్ కప్‌కు మాత్రం స్వదేశంలోనే సన్నద్దం అవుతారని బోర్డు అధికారి వెల్లడించారు.

  ఇక సిరీస్ రద్దు విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. పీసీబీ, ఏసీబీ బోర్డుల అపెక్స్ బాడీ మూడు వన్డేల సిరీస్‌ను వాయిదా వేయడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నది. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జరుగాల్సిన వన్డే సిరీస్‌ను 2022కు రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. 'సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు మమ్మల్ని సంప్రదించారు. ఈ ఏడాది జరగాల్సిన సిరీస్‌ను వాయిదా వేసి 2022కి రీషెడ్యూల్ చేయమని కోరారు. శ్రీలంక వేదికగా జరగాల్సి ఉన్నా.. అక్కడ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు అఫ్గాన్ క్రికెటర్ల మెంటల్ హెల్త్ సరిగా లేదని తెలుస్తున్నది. బ్రాడ్‌కాస్టింగ్ ఎక్విప్‌మెంట్ కూడా లేదని తెలిసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము' అని పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.

  ఇవి కూడా చదవండి :

  Sourav Ganguly Salary: సౌరవ్ గంగూలీ, జై షాకు బీసీసీఐ ఎంత వేతనం చెల్లిస్తున్నది? గంగూలీ సంపాదన ఎంత?

  Team India Next Coach: టీమ్ ఇండియా కోచ్ రేసు నుంచి తప్పుకున్న రాహుల్ ద్రవిడ్.. నెక్ట్ప్ కోచ్ రేసులో ఉన్నది కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్?


  Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్ ఏ ఫార్మాట్‌లో ఆడతారో తెలుసా? లాస్ఏంజెల్స్ నుంచే క్రికెట్ షురూ?
  Published by:John Naveen Kora
  First published: