AFG vs SL 2nd ODI : బ్లాక్ బస్టర్ లా మారుతుందనుకున్న ఆదివారం కాస్తా తుస్సుమనిపించింది. క్రికెట్ అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఒకే రోజు రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. తొలుత న్యూజిలాండ్ (New Zealand), భారత్ (India) జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత శ్రీలంక (Sri Lanka), అఫ్గానిస్తాన్ (Afghanistan) జట్ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. తొలి వన్డేలో ఓడిన శ్రీలంకకు ఈ వన్డే చాలా ముఖ్యమైనది. అఫ్గానిస్తాన్ చేతిలో తొలి వన్డేలో శ్రీలంక దారుణంగా ఓడిపోయింది. అయితే రెండో వన్డేలో కమ్ బ్యాక్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అయితే శ్రీలంక గెలుపుపై వరుణుడు నీళ్లు చల్లాడు. 229 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక వర్షంతో ఆట నిలిచే సమయానికి 2.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఈ దశలో వాన రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. అనంతరం వాన ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు.
వర్షంతో ఈ మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ ను శ్రీలంక గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నెల 30న జరిగే మూడో వన్డేలో శ్రీలంక నెగ్గితే సిరీస్ 1-1తో సమం అవుతుంది. అందులో లంక జట్టు ఓడినా.. లేదా వర్షంతో రద్దు అయినా అఫ్గాన్ ఖాతాలోకి సిరీస్ చేరుతుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 48.2 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (73 బంతుల్లో 68; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకం బాదాడు. రహ్మద్ షా (78 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు.
Handshakes ???? all around after Afghanistan's 2⃣nd ODI match against Sri Lanka has been called off due to persistent rain ????️ in Kandy. We go again on Wednesday for the third & final ODI of the series. #AfghanAtalan | #CWCSL | #AFGvSL | #SuperCola | #KamAir pic.twitter.com/qfEyDhET6x
— Afghanistan Cricket Board (@ACBofficials) November 27, 2022
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇబ్రహీం జద్రాన్ (10) విఫలం అయ్యాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన రహ్మత్ షాతో కలిసి రహ్మనుల్లా గుర్బాజ్ జట్టును ఆదుకున్నాడు. వీరు రెండో వికెట్ కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ 6 పరుగుల తేడాలో పెవిలియన్ కు చేరుకున్నారు. వీరి తర్వాత మిగిలిన అఫ్గాన్ బ్యాటర్లు విఫలం అయ్యారు. చివర్లో మొహమ్మద్ నబీ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఒక దశలో అఫ్గానిస్తాన్ 250 పరుగుల మార్కును ఈజీగా అందుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో వికెట్లను కోల్పోయిన అఫ్గాన్ ఆ మార్కుకు దూరంగా ఆగిపోయింది. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు తీశాడు. తీక్షణ, లహిరు కుమార చెరో రెండు వికెట్లు తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Ind vs NZ ODI series, Rashid Khan, Sri Lanka