హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ అద్భుత రికార్డు.. అతడి దరిదాపుల్లో మరో ఆటగాడు లేడు

IPL 2021 : ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ అద్భుత రికార్డు.. అతడి దరిదాపుల్లో మరో ఆటగాడు లేడు

ఐపీఎల్ అంటేనే ధనాధన్ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ బంతుల కంటే ఎక్కువ రన్స్ ఉండాలి. అత్యంత వేగంగా పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. క్రికెట్ ‌బుక్‌లో ఉండే షాట్లే కాదు.. అవసరమైతే కొత్త తరహా షాట్లను కనిపెట్టి మరీ పరుగులు రాబట్టాలి. అలాంటి క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఏబీ డివిలియర్స్ మాత్రమే. చిత్ర విచిత్రమైన షాట్లు కొట్టడంలో ఏబీకి మరెవరూ సాటి లేరు. స్విచ్, స్వీప్, పెడల్ స్వీప్ ఇలా ఎన్నో రకాల షాట్లు కొడుతుంటాడు. అవసరమైతే వికెట్లు మొత్తం వదిలేసి షాట్లు ఎలా కొట్టాలో ఏబీకి తప్ప మరెవరికీ తెలియదు. అందుకే అతడిని మిస్టర్ 360 డిగ్రీస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఏబీడీ.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో విదేశీ క్రికెటర్‌గా ఏబీడీ నిలిచాడు. అంతకు ముందు డేవిడ్ వార్నర్ ఈ ఘనతను సాధించాడు.

ఇక ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మార్కును అందుకున్న క్రికెటర్‌గా ఏబీ డివిలియర్స్ రికార్డు సృష్టించాడు. ఏబీ డివిలియర్స్ కేవలం 3288 బంతుల్లోనే 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిలిచాడు. వార్నర్ 3554 బంతుల్లో 5 వేల పరుగులు పూర్తి చేశాడు. ఏబీడీ, వార్నర్ మధ్య 266 బంతుల తేడా ఉన్నది. ఇక ఐదు వేల పరుగులు పూర్తి చేసిన వారిలో సురేష్ రైనా (3620), రోహిత్ శర్మ (3817), విరాట్ కోహ్లీ (3827), శిఖర్ ధావన్ (3956) ఉన్నారు. ఇప్పట్లో ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టగలిగే క్రికెటర్ దరిదాపుల్లో కూడా లేడు. ఈ రికార్డు మరికొన్ని ఏళ్ల పాటు నిలిచిపోడం ఖాయమే.


మరోవైపు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో ఏబీడీ 6వ స్థానంలో ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 6041 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సురేష్ రైనా (5472 పరుగులు), శిఖర్ ధావన్ (5462), రోహిత్ శర్మ (5431), డేవిడ్ వార్నర్ (5390), ఏబీ డివిలియర్స్ (5053), క్రిస్ గేల్ (4891), ఎంఎస్ ధోనీ (4669), రాబిన్ ఊతప్ప (4607), గౌతమ్ గంభీర్ (4217)లు టాప్ 10 స్థానాల్లో ఉన్నారు. టాప్ 10 ప్లేయర్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్నది ఏబీ డివిలియర్స్‌కే. 152.70 స్ట్రైక్ రేట్‌తో ఏబీడీ ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (149.16 స్ట్రైక్ రేటు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

First published:

Tags: Cricket, IPL 2021, Royal Challengers Bangalore

ఉత్తమ కథలు