35 SALARY CUT FOR CRICKETERS SRILANKA BOARD TO SIGN NEW CONTRACTS WITH PAY CUTS JNK
Cricket : జీతంలో 35 శాతం కోత.. కాంట్రాక్టుపై సంతకాలకు క్రికెటర్ల నిరాకరణ.. డైలమాలో ఆ సిరీస్
శ్రీలంక క్రికెటర్ల వేతనాల్లో భారీ కోత
కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్ బోర్డులు ఆదాయాలు భారీగా కోల్పోయాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్ల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. తాజాగా శ్రీలంక క్రికెట్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నది.
కరోనా మహమ్మారి కారణంగా (Corona) ఏడాదిన్నర పైగా షెడ్యూల్ ప్రకారం క్రికెట్ (Cricket) సిరీస్లు జరగడంలో లేదు. ఎన్నో వ్యాపార సంస్థలు, ఎంఎన్సీలు, కంపెనీలు ఆదాయం కోల్పోయినట్లే క్రికెట్ బోర్డులు కూడా భారీగా ఆదాయాన్ని (Income) నష్టపోయాయి. ద్వైపాక్షిక సిరీస్లు వాయిదా పడటం, లీగ్స్ నిర్వహణ కష్టంగా మారడంతో స్పాన్సర్లు, టీవీ హక్కుల ద్వారా రావల్సిన ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. మరోవైపు క్రికెట్ మ్యాచ్లు జరిగినా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో టికెట్ల ఆదాయం కూడా రావడం లేదు. ఇలా అన్ని వైపులా ఆదాయమార్గాలు మూసుకొని పోవడంతో పలు క్రికెట్ బోర్డులు నష్టాలపాలయ్యాయి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా తాము భారీగా ఆదాయాన్ని కోల్పోయామని ఇప్పటికే ప్రకటించాయి. ఇక గత ఏడాది జరగాల్సిన ఇండియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్ల పర్యటనలు వాయిదా పడటంతో శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket) కూడా భారీగా నష్టపోయింది. దీంతో ఈ ఏడాది తమ కాంట్రాక్టు క్రికెటర్ల (Contract Cricketers) వేతనంలో 35 శాతం కోత (Salary Cut) విధించాలని నిర్ణయించింది.
శ్రీలంక క్రికెట్ తమ కొత్త కాంట్రక్టుపై సంతకాలు చేయాలని పలువురు క్రికెటర్లను కోరింది. అయితే సీనియర్ క్రికెటర్లు అయిన ఏంజిలో మాథ్యూస్, సురంగ లక్మల్, దినేశ్ చందిమల్, టెస్టు క్రికెటర్ దిముత్ కరుణరత్నే కొత్త కాంట్రాక్టుపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కాంట్రాక్టు ప్రకారం ఏంజిలో మాథ్యూస్ 50వేల డాలర్లు, కరుణరత్నే 30 వేల డాలర్ల ఆదాయాన్ని కోల్పోనున్నారు. మాథ్యూస్ ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం 1,30,000 డాలర్లు వస్తుండగా.. ఇప్పుడు అందులో 50 వేల డాలర్లు కోత విధించనున్నారు. మరోవైపు కరుణరత్నకు 1 లక్ష డాలర్లు అందుతుండగా.. కొత్తగా 70 వేల డాలర్లు మాత్రమే లభించనున్నది. అయితే మాథ్యూస్ తనకు జీతం పెంచాలని కోరుతుండగా.. కరుణరత్న కనీసం ఇప్పుడు ఉన్న జీతం అయినా కొనసాగించాలని కోరుతున్నాడు. సురంగ లక్మల్ జీతంలో కోత వేసి రెండో కేటగిరీకి డిమోట్ చేశారు. ధనుష్క గునతిలకే కూడా 30 వేల డాలర్ల కోతకు గురయ్యాడు. కాగా తమ జీతాల కోతకు ఒప్పుకోమని.. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. అప్పటి వరకు కాంట్రాక్టులపై సంతకాలు చేయలేమని క్రికెటర్లు అంటున్నారు.
ప్రస్తుతం క్రికెటర్లు అందరూ కొత్త కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి నిరాకరించడంతో వచ్చే వారం (మే 23) నుంచి ప్రారంభం కావల్సిన బంగ్లాదేశ్ పర్యటన డైలమాలో పడింది. శ్రీలంక జట్టు 3 వన్డేల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ సిరీస్కు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారో లేదో అనే సందిగ్దత నెలకొన్నది. మరోవైపు శ్రీలంక సెలెక్టర్లు సీనియర్ క్రికెటర్లను పక్కన పెట్టిన తర్వాతే వారి కాంట్రాక్టు వేతనాల్లో కోత విధించడం గమనార్హం. మరోవైపు వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా, ధనంజయ డి సిల్లాలకు కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉన్నది. వారిద్దరూ టాప్ కేటగిరీలో ఉండనున్నట్లు సమాచారం.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.