Home /News /sports /

12 ELITE CLUBS FORMED EUROPEAN SUPER LEAGUE UEFA THREATENS BAN ON CLUBS AND PLAYERS JNK

Football : ఛాంపియన్స్ లీగ్‌లో చీలిక.. 12 క్లబ్స్ కలసి కొత్త లీగ్.. ఫిఫా ఏమంటుందంటే?

12 క్లబ్స్‌తో కొత్త యూరోపియన్ సూపర్ లీగ్

12 క్లబ్స్‌తో కొత్త యూరోపియన్ సూపర్ లీగ్

    ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన టీమ్ స్పోర్ట్స్ ఫుట్‌బాల్ (Football). ఈ ఆటను లాటిన్ అమెరికా, యూరోపిన్ దేశాల్లో ఎక్కువగా ఆదరిస్తుంటారు. యూరోపిన్ ఫుట్‌బాల్ లీగ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఫిఫా (FIFA) నిర్వహించే వరల్డ్ కప్ స్థాయిలో ఛాంపియన్స్ లీగ్ జరుగుతుంటుంది. యూరోప్‌లోని అన్ని దేశాల్లో నిర్వహించే ఫుట్‌బాల్ లీగ్స్‌లో అర్హత సాధించే జట్లతో ఛాంపియన్స్‌లీగ్ (Champions League) నిర్వహిస్తుంటారు. యూనియన్ ఆఫ్ యూరోఫ్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్‌ఏ) (UEFA) ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్స్ లీగ్ జరుగుతుంది. కాగా, యూఈఎఫ్ఏ‌లో సభ్యులైన 12 ఎలైట్ క్లబ్స్ ఈ సమాఖ్య నుంచి తప్పుకొని కొత్తగా యూరోపియన్ సూపర్ లీగ్ (ఈఎస్ఎల్) (ESL) నిర్వహించేందుకు సమాయత్తం అయ్యాయి. రియల్ మాడ్రిడ్ క్లబ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటీనో పెరెజ్ ఈఎస్ఎల్‌కు బాస్‌గా వ్యవహరించనున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన అర్సెనల్, ఛెల్సీ, లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ, మాంచెస్టర్ యునైటెడ్, టొటెన్‌హామ్.. స్పెయిన్‌కు చెందిన అట్లెటికో మాడ్రిడ్, బార్సిలోనా, రియల్ మాడ్రిడ్.. ఇటలీకి చెందిన ఏసీ మిలన్, ఇంటర్ మిలన్, జువెంటస్ క్లబ్స్ ఛాంపియన్స్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి.

    అసలు కారణం ఏమిటి?

    యూఈఎఫ్ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛాంపియన్స్ లీగ్‌ను 2024-25 సీజన్ నుంచి 36 జట్లకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న విధానంలో కాకుండా ఓపెన్ విధానంలో ఛాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రతీ ఫుట్‌బాల్ క్లబ్ కింది స్థాయి పోటీలతో పాటు, దేశవాళీ పోటీల్లో అర్హత సాధించడం ద్వారా ఛాంపియన్స్ లీగ్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. అయితే, ఎలైట్ క్లబ్స్ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఛాంపియన్స్ లీగ్ సుదీర్ఘంగా జరుగుతున్నదని.. ఇక 36 జట్లకు చేరితే మరింత ఎక్కువ కాలం ఛాంపియన్స్ లీగ్ ఆడాల్సి ఉంటుందని అంటున్నాయి. అంతే కాకుండా కేవలం గెలిచిన జట్లకే అధిక ఆదాయం ఉంటుంది. మిగిలిన క్లబ్స్ దీని వల్ల నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బయటకు వచ్చిన 12 ఫుట్‌బాల్ క్లబ్స్ చెబుతున్నాయి.

    కొత్త లీగ్ ఎలా ఉండబోతున్నది?

    ఛాంపియన్స్ లీగ్‌లో గెలిచిన వారికే భారీగా నగదు బహుమతి వస్తున్నది. కానీ కొత్తగా ప్రతిపాదించిన యూరోపియన్ సూపర్ లీగ్‌లో మాత్రం ప్రతీ జట్టుకు భారీ మొత్తంలో నగదు అందేలా రూపొందించారు. గతంలో ఛాంపియన్స్ లీగ్‌లో గెలిస్తే ఎంత మొత్తం వచ్చేదో.. అంతకు మూడు రెట్లు ఎక్కువగా బహుమతి అందేలా లీగ్ నిర్వహించనున్నారు. కేవలం 12 ఫుట్‌బాల్ క్లబ్స్ మధ్యే ఈ లీగ్ జరుగనున్నది. దీంతో ప్రేక్షకుల ఆదరణ ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకమే.

    ఫిఫా, యూఈఎఫ్ఏ ఏమంటున్నాయి?

    12 క్లబ్స్ కలసి కొత్త లీగ్‌ను ఏర్పాటు చేయడం చట్ట విరుద్దమని అంటున్నాయి. ఈఎస్ఎల్‌లో పాల్గొనే జట్లు, ఆటగాళ్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఆయా ఆటగాళ్లను కూడా ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని యూఈఎఫ్ఏ హెచ్చరించింది. అయినా సరే ఆ క్లబ్స్ హెచ్చరికలను పెడచెవిన పెట్టాయి. మరోవైపు ఫిఫా కూడా కొత్త లీగ్‌ను వ్యతిరేకించింది. ఈ లీగ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దీన్ని గుర్తించబోమని స్పష్టం చేసింది.

    అది అసాధ్యం : ఫ్లోరెంటీనో పెరెజ్

    కొత్తగా ఏర్పాటు చేయనున్న యూరోపిన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధిస్తామని యూఈఎఫ్ఏ హెచ్చరిచడంపై ఈఎస్ఎల్ చీఫ్ స్పందించారు. యూఈఎఫ్ఏకు అలాంటి అర్హతలు లేవని ఆయన స్పష్టం చేశారు. అన్ని లీగ్స్‌లాగే యూఈఎఫ్ఏ కూడా ఒక ప్రైవేటు సంస్థే అని ఆయన స్పష్టం చేశారు. క్లబ్స్‌లో ఆడే క్రీడాకారులను అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధిస్తామనడం హస్యాస్పదమని ఆయన చెప్పారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: ESL, FIFA, Football, UEFA

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు