హోమ్ /వార్తలు /క్రీడలు /

ICC Hall Of Fame : ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 10 మంది టెస్ట్ క్రికెటర్లు.. డబ్ల్యూటీసీ నేపథ్యంలో చోటు కల్పించిన ఐసీసీ

ICC Hall Of Fame : ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 10 మంది టెస్ట్ క్రికెటర్లు.. డబ్ల్యూటీసీ నేపథ్యంలో చోటు కల్పించిన ఐసీసీ

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 10 మంది క్రికెటర్లకు చోటు (PC: ICC)

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 10 మంది క్రికెటర్లకు చోటు (PC: ICC)

టెస్ట్ క్రికెట్‌ను ఐదు కాలాలుగా విభజించి ప్రతీ కాలం నుంచి ఇద్దరు చొప్పున 10 మంది క్రికెటర్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. ఇప్పటికే ఉన్న 98కి తోడు మరో 10 మంది జత కలపడంతో మొత్తం సంఖ్య 108కి చేరింది. వీరిలో ఇండియా నుంచి వినూ మన్కడ్ కూడా ఉండటం విశేషం.

ఇంకా చదవండి ...

సుదీర్ఘ టెస్ట్ ఫార్మాట్‌లో (Test Cricket) చేసిన సేవలకు గాను 10 మంది క్రికెటర్లను హాల్ ఆఫ్ ఫేమ్ (Hall of Fame)జాబితాలో చేరుస్తూ అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) (ICC) నిర్ణయం తీసుకున్నది. అరంగేట్రం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC Final) జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 93 మంది క్రికెటర్లకు మరో 10 మందిని చేర్చాలనే నిర్ణయం తీసుకున్నది. క్రికెట్‌ను ఐదు కాలాలుగా విభజించిన ఐసీసీ.. ప్రతీ ఎరా నుంచి ఇద్దరు చొప్పున క్రికెటర్లను ఎంపిక చేసింది. ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పేర్లను ప్రకటించారు. అలన్ విల్కిన్స్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ క్యార్యక్రమానికి లీసా స్తాలేకర్, లారెన్స్ బూత్‌లు స్పెషలిస్ట్ ప్యానల్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. మరోవైపు హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన కుమార సంగక్కర, ఆడీ ఫ్లవర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఓటింగ్ అకాడమీ, లివింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యులు, ఫికా ప్రతినిథులు, ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, సీనియర్ ఐసీసీ సభ్యులు కలసి ఈ 10 మందిని ఎంపిక చేశారు.

1918కి ముందు

1. ఆబ్రీ ఫాల్కనర్ (సౌత్ ఆఫిక్రా)

దక్షిణాఫ్రికా తరపున 25 టెస్టులు ఆడిన ఫాల్కనర్ 1754 పరుగులు (40.79 సగటు) చేశారు. 26.58 సగటుతో 82 వికెట్లు కూడా తీశారు. గూగ్లీ బంతిని వేయడం మొదలు పెట్టిన వారిలో ఫాల్కనర్ కూడా ఒకరు. ఐసీసీ బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరిన ఏకైక టెస్ట్ క్రికెటర్ ఫాల్కనర్. 1910-11లో ఆస్ట్రేలియాపై కేవలం 5 టెస్టుల్లో 732 పరుగులు చేశాడు.

2. మాంటీ నోబెల్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా తరపున 42 టెస్టులు ఆడిన మాంటీ నోబెల్ 30.25 సగటుతో 1997 పరుగులు చేశాడు. అంతే కాకుండా 25 సగటుతో 121 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా జట్టులో గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో మాంటీ నోబెల్ ఒకరు. 42 టెస్టులు ఆడిన మాంటీ 15 టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 1000 పరుగులు, 100 వికెట్లు నమోదు చేసిన క్రికెటర్‌గా ఇంకా కొనసాగుతున్నాడు. క్రికెటర్‌గా మాత్రమే కాకుండా డెంటిస్ట్, బ్యాంకర్‌గా కూడా పనిచేశాడు.

1918 - 1945

3. సర్ లారీ కాన్‌స్టాంటిన్ (వెస్టిండీస్)

కరేబియన్ క్రికెటర్ అయిన కాన్‌స్టాంటిన్ 18 టెస్టులు ఆడి 19.24 సగటుతో 635 పరగులు చేశాడు. అంతే కాకుండా 30.10 సగటుతో 58 వికెట్లు కూడా తీశాడు. వెస్టిండిస్ జట్టులో తొలి గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్‌గా కాన్‌స్టాంటిన్ రికార్డులకు ఎక్కడు. కేవలం క్రికెటర్‌గానే కాకుండా జాతి వివక్షకు గురవుతున్న తన ప్రజల తరపు రాజకీయ, న్యాయ పోరాటాలు చేసిన అందరి మనసుల్లో నిలిచిపోయాడు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యుడిగా ఎన్నికైన తొలి నల్లజాతీయుడుగా రికార్డులకు ఎక్కాడు.

4. స్టాన్ మెక్‌కాబ్ (ఆస్ట్రేలియా)

ఆసీస్ తరపున 39 టెస్టులు ఆడిన స్టాన్ మెక్‌కాబ్ 48.21 సగటుతో 2748 పరుగులు చేశాడు. బౌలర్‌గా 42.86 సగటుతో 36 వికెట్లు తీశాడు. అప్పట్లో చాలా ప్రాచూర్యం పొందిన 'బాడీలైన్ టాక్టీస్'ను వ్యతిరేకించడమే కాకుండా.. అతడిపై ఇంగ్లాండ్ జట్టు అలా ప్రయోగించినా బెదరకుండా క్రీజులో నిలబడి 187 పరగులు చేశాడు. అలాగే 1935లో జొహన్నెస్‌బర్గ్‌లో 189 పరుగులు, 1938లో యాషెస్ సిరీస్‌లో భాగంగా కేవలం 4 గంటల్లో 232 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సర్ డాన్ బ్రాడ్‌మాన్ చేత గ్రేటెస్ట్ బ్యాట్స్‌మాన్ అనిపించుకున్నాడు.

1946 - 1970

5. టెడ్ డెక్ట్సర్ (ఇంగ్లాండ్)

ఇంగ్లీష్ జట్టులో సభ్యుడైన టెడ్ డెక్ట్సర్ 62 టెస్టుల్లో 47.89 సగటుతో 4502 పరుగులు చేశాడు. బౌలర్‌గా 34.93 సగటుతో 66 వికెట్లు తీశాడు. ఫ్రంట్, బ్యాక్‌ఫుట్ మీద ఎలాంటి బౌలింగ్‌ను అయినా డిఫెండ్ చేయడంలో అత్యంత ప్రతిభ గల క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 1996లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో అతడు చేసిన 70 పరుగుల ఇన్నింగ్స్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. ఇక మీడియం పేసర్ అయిన టెడ్ డెక్ట్సర్ మంచి పార్ట్‌నర్‌షిప్ బ్రేకర్‌గా నిలిచిపోయాడు. ఇంగ్లాండ్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్‌గా పని చేసిన టెడ్.. ఆ తర్వాత కాలంలో ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ సిస్టమ్‌ను అభివృద్ది చేశాడు.

6. వినూ మన్కడ్ (ఇండియా)

భారత జట్టు తరపున 44 టెస్టులు ఆడిన వినూ మన్కడ్ 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. బౌలర్‌గా 32.32 సగటుతో 162వికెట్లు తీశాడు. టీమ్ ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్‌గానే కాకుండా సాంప్రదాయ లెఫ్టార్మ్ స్లో బౌలర్‌గా సేవలు అందించాడు. 1952లొ ఇంగ్లాండ్‌లోని లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 72, 184 పరుగులు చేయడమే కాకుండా.. 97 ఓవర్లు బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్‌మాన్ బంతి వేయక ముందే క్రీజ్ వదిలితే వారిని రనౌట్ చేయడం మొదలు పెట్టింది వినూ మన్కడే. అందుకే అలా ఔట్ చేయడాన్ని 'మన్కడింగ్' అని పిలుస్తారు. కాగా వినూ మన్కడ్ కోచింగ్ ఇచ్చిన సునిల్ గవాస్కర్ అతడి కంటే ముందుగానే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం విశేషం.

1971 - 1995

7. డెస్మండ్ హెన్స్ (వెస్టిండీస్)

వెస్టిండీస్ తరపున 116 టెస్టులు ఆడిన డెస్మండ్ హెన్స్ 42.29 సగటుతో 7487 పరుగులు చేశాడు. గోర్డన్ గ్రీనిడ్జ్‌తో కలసి ఎన్నో భారీ ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మంచి టైమింగ్ కలిగిన డెస్మండ్ హెన్స్ నాలుగు ఐసీసీ వరల్డ్ కప్‌లలో కూడా ఆడాడు. టెస్టు, వన్డే క్రికెట్‌లో డెస్మండ్ సేవలు మరిచిపోలేనివి.

8. బాబ్ విల్లిస్ (ఇంగ్లాండ్)

ఇంగ్లాండ్ తరపున 90 టెస్టులు ఆడిన బాబ్ విల్లీస్ 25.20 సగటుతో 325 వికెట్లు తీశాడు. బంతిని స్వింగ్ చేయడంలో బాబ్ విల్లీస్‌ని మించిన వాళ్లు లేరు. చాలా ఎత్తుగా ఉండే బాబ్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలగడమే కాకుండా యార్కర్లు, బౌన్సర్లు వేయడంలో దిట్ట. 1991లో హెడింగ్లేలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగులకు 8 వికెట్లు తీశాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కామెంటేటర్‌గా కూడా చాలా పాపులర్ అయ్యాడు.

1996 - 2015

9. ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే)

జింబాబ్వే తరపున 63 టెస్టులు ఆడిన ఆండీ ఫ్లవర్ 51.54 సగటుతో 4794 పరుగులు చేశాడు. జింబాబ్వే జట్టు కీపర్‌గా 151 క్యాచ్‌లు, 9 స్టంపింగ్స్ చేశాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కిన మొదటి జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్. ఒకానొక సమయంలో ప్రపంచంలో నెంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే బ్యాటింగ్ భారాన్ని ఎంతోకాలం మోసాడు. 2000లో నాగ్‌పూర్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 232 పరుగులు చేశాడు. ఒక వికెట్ కీపర్ టెస్టుల్లో చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఇంగ్లాండ్ జట్టును కోచ్‌గా చాలా కాలం పని చేసిన ఆండీ ఫ్లవర్ ఆ జట్టును నెంబర్ 1 స్థానానికి తీసుకొని వెళ్లాడు.

10. కుమార సంగక్కర (శ్రీలంక)

శ్రీలంక తరపున 134 టెస్టులు ఆడిన సంగక్కర ప్రస్తుత తరానికి కూడా సుపరిచితమే. 57.40 సగటుతో 12400 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో వికెట్ కీపర్‌గా 182 క్యాచ్‌లు పట్టడంతో పాటు 20 స్టంపింగ్స్ చేశాడు. శ్రీలంక తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా తన కెరీర్‌ను ముగించాడు. 2014లో బంగ్లాదేశ్‌తోజరిగిన టెస్టులో 319, 105 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

First published:

Tags: Cricket, ICC, Test Cricket, WTC Final

ఉత్తమ కథలు