Tirupathi By-Poll: తిరుపతిలో ఏ పార్టీ బలమెంత.., వైసీపీ హవాను ప్రతిపక్షాలు అడ్డుకోగలవా..?

వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు (ఫైల్)

2019 ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) తరపున పోటీ చేసిన బల్లి దుర్గా ప్రసాద్... టీడీపీ (Telugu Desham Party) అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే.. తిరుపతి లోక్ సభ స్థానానికి సంబంధించిన ఉపఎన్నికను నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 17 తిరుపతి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు యత్నిస్తుండగా.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు తమ ఉనికిని చాటుకునేందుకు జనసేన-బీజేపీ కూడమి ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా నోటిఫికేషన్ విడుదలవడంతో మూడు పార్టీలకు మళ్లీ పనిపడింది. టీడీపీ ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించగా.. వైసీపీ డాక్టర్ గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసింది. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఓ మాజీ ఐఏఎస్ ను నిలబెట్టేందుకు కూటమి యత్నిస్తోంది.

  సిట్టింగ్ స్థానం కావడం, రాష్ట్రంలో బలంగా ఉండటంతో తిరుపతిలో గెలుపు నల్లేరుపై నడకేనని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించిన పాజిటివ్ వేవ్ తో వైసీపీ గెలుపుపై ధీమాగా ఉంది. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి రెట్టింపు అవుతుందని భావిస్తోంది. ఇక టీడీపీ విషయానికి వస్తే అందరికంటే ముందుగానే తిరుపతి ఉప ఎన్నికల కోసం ఆ పార్టీ రంగంలోకి దిగింది. ప్రత్యేక కార్యాలయంతో పాటు కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాలుగా విభజించి ఓ జంబో కమిటీకి అప్పగించింది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఉప ఎన్నిక ప్రచారం సైలెంట్ అయింది. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో మళ్లీ అలర్ట్ అవుతోంది.

  ఉపఎన్నిక విషయంలో జనసేన-బీజేపీ కూటమి కాస్త వెనుకబడింది. అభ్యర్థి ఎంపికలోనే ఈ రెండు పార్టీలు కాలం గడిపేశాయి. ఇటీవలే తాము బరిలోకి దిగుతున్నట్లు ప్రకిటించన బీజేపీ.. రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులను అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసింది. చివరి నిముషంలో మార్పులంటే తప్ప ఆయన పేరు ప్రకటించడమే తరువాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయలేకపోయిన జనసేన-బీజేపీ పార్టీలు.. ఈసారి ఏమేరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

  కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బల్లి దుర్గా ప్రసాద్... టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా గత ఏడాది సెప్టెంబర్లో కరోనా కారణంగా ఆయన మృతి చెందడంతో తిరుపతి లోక్ సభ స్థానానికి ఖాళీ ఏర్పడింది.
  Published by:Purna Chandra
  First published: