ఏపీలో ఓ వైపు కరోనా జోరు కొనసాగుతుండగానే... మరోవైపు రాజకీయ వేడి కూడా కొనసాగుతోంది. రాజకీయంగా వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఏపీ అధికార పార్టీకి ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ టార్గెట్ అయ్యారా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కొద్ది రోజుల క్రితం ర్యాపిడ్ కిట్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ ఆయనపై ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఏకంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీ ఫండ్ స్వాహా చేశారనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు.
ఈ విషయంలో ఆయన కన్నాతో ఢీ అంటే ఢీ అనేశారు. అయితే ఆ అంశంపై ఇరు పార్టీలు సైలెంట్ అయిపోయాయి. అయితే తాజాగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేస్తూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కన్నా తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రేపు తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన బుగ్గన... అలా చేయని పక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.
దీంతో వైసీపీ నేతలు కన్నాను ప్రత్యేకంగా టార్గెట్ చేశారేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు చెప్పినట్టుగా తమపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగానే బీజేపీపై పెద్దగా విమర్శలు చేయకుండా... కేవలం కన్నాను టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి విజయసాయిరెడ్డి విషయంలో వేగంగా స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ... మంత్రి బుగ్గన చేసిన సవాల్‌పై ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.