‘పవర్’ ప్రాబ్లమ్స్.. వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి

తొమ్మిదేళ్ల పాటు అధికారం కోసం ఎదురుచూసిన వైసీపీ నేతలు.. జగన్ హయాంలో తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచుతున్నారు.

news18-telugu
Updated: June 12, 2019, 6:49 PM IST
‘పవర్’ ప్రాబ్లమ్స్.. వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి
విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాన్ హోరులో సైకిల్ గల్లంతైంది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో కీలక నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పార్టీ జెండా మోసి, జేబులో డబ్బులు ఖర్చుచేసిన ద్వితియ శ్రేణి నాయకులు నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, పనుల కోసం ప్రకాశం జిల్లా సీనియర్ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, డీలర్ షిప్స్ తమకే కావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు జిల్లాలో విరివిగా సాగుతున్న నీటి సరఫరా ట్యాంకర్ల కేటాయింపుల కోసం మరింత ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే అధికారిక అనుమతులు పక్కనబెట్టి అనేక గ్రామాల్లో వైసీపీ నాయకులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయటం ప్రారంభించారు. మరోవైపు.. గెలిచిన ఎమ్మెల్యేలు.. అధికారుల్ని, స్థానిక పోలీసులను మార్చాలని నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.

మంత్రి బాలినేనిపై భారీగా ఒత్తిళ్లు..!

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఆయనపై పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఒత్తిళ్లు పెంచారు. సొంత నియోజకవర్గంతో పాటు బయటి నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు ఎక్కువగా వచ్చి ఆయన్ను కలిసి వారి బాధలు చెప్పుకోవడం ప్రారంభించారు. జిల్లా, ఆయా నియోజకవర్గ స్థాయిలో పోస్టింగ్‌ల కోసం తిరిగే అధికారులు, ఉద్యోగులైతే భారీగా వచ్చిన ఆయన్ను కలుస్తున్నారు. జిల్లాస్థాయి అధికారుల చేర్పులు, మార్పులకు తోడు ఆయా నియోజకవర్గాల్లో పోస్టింగ్‌ల కోసం వస్తున్న వారు గత ఏడెనిమిదేళ్లుగా వైసీపీ వాదులుగా తమపై ముద్ర వేసి ప్రభుత్వాలు ఇబ్బందిపెట్టాయని, ఇప్పుడైనా న్యాయం చేయాలని చేస్తున్న వినతులు ఆయనకు కూడా ఇబ్బందికరంగా మారాయి.

బాలినేని శ్రీనివాసరెడ్డి (విద్యుత్, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ)


నీళ్ల ట్యాంకర్ల కోసం పోరాటం..!

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రతి గ్రామానికీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోనే రోజుకు 2,000 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో 60 శాతం పంచాయతీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఈ ట్యాంకర్లకు దూరాన్ని బట్టి ఒక్కో ట్రిప్పునకు ప్రభుత్వం రూ.500 వరకూ ఇస్తుంది. ఒక్కో ట్యాంకర్‌ ద్వారా రోజుకు మూడు, నాలుగు ట్రిప్పులు సరఫరా చేసి... సరఫరా చేయకుండా మరో రెండు ట్రిప్పులు లెక్కల్లో జమచేస్తే.. అదనంగా రూ.1000 వరకూ మిగులుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా గ్రామాల్లోని వైసీపీ శ్రేణులంతా అప్రమత్తమై నీటి ట్యాంకర్ల సరఫరాను టీడీపీ వారి నుంచి నిలిపివేసి తమకు కట్టబెట్టాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి ఎలాంటి అనుమతులు లేకుండానే తమ ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ పరిస్థితిని గమనించి ఇప్పటివరకూ నీటిని సరఫరా చేస్తున్న టీడీపీ అభిమాన ట్యాంకర్‌ యజమానులు మానుకోగా, ఎక్కువచోట్ల పోటీగా నీటిని సరఫరా చేస్తున్నారు. రేపు బిల్లులు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల సిఫార్సులకు అనుగుణంగానే జరుగుతాయన్న నమ్మకంతో వైసీపీ శ్రేణులు అనుమతులు లేకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు.

ట్యాంకర్లతో నీటి సరఫరా (File)
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకోసం ఒత్తిడి..!

మరోవైపు ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ పోస్టుల కోసం ఇదే స్థాయి ఒత్తిడి కనిపిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం వంద నుంచి 140 మంది వరకూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను గత ప్రభుత్వం నియమించింది. జిల్లాలో 1,200 నుంచి 1,400 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో వీరిది కీలకపాత్ర. అలాగే పారితోషికం కూడా నెలకు రూ.12వేల వరకూ ఉంది. దీంతో ఆ పోస్టులను తమ వారికే కేటాయించాలని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలపై భారీగా ఒత్తిడి చేస్తున్నారు.

డీలర్‌షిప్‌లు, అంగన్‌వాడీలను మార్చండి
రేషన్‌ డీలర్‌షిప్పుల మార్పు, అంగన్‌వాడీ పోస్టులు, వీటన్నింటికీ మించి ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన గ్రామ వాలంటీర్ల నియామకం కోసం వైసీపీ నేతలు ఎమ్మెల్యేలపై భారీగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఇబ్బందికర పరిస్థితికి గురవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేల పరిస్థితి ‘కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది.

ప్రతీకాత్మక చిత్రం


కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు ఇబ్బందులు

సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు తొలిసారి గెలుపొందారు. ద్వితీయశ్రేణి నేతలు ఒత్తిడికి వీరు ఏమి సమాధానం చెప్పాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలపై ఒత్తిడి అధికంగా ఉంది. దర్శి నుంచి గెలుపొందిన వేణుగోపాల్‌ వద్దకు కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ఒకవైపు, రెడ్డి సామాజికవర్గం వారు మరోవైపు నుంచి కూడా ఒత్తిడి వస్తోంది. వారిద్దరినీ సమన్వయం చేసుకోవడంతోపాటు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వంటి ముఖ్య నాయకుల సలహాలు కూడా తీసుకోవాల్సి రావడంతో మరింత ఇబ్బందికర పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు.

కొండపిలో విచిత్ర పరిస్థితి..!

కొండపిలో అయితే విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఓడిపోయిన వెంకయ్యకు సహజంగా పార్టీ వ్యవహారాలను చూసే అవకాశం లభిస్తుంది. తదనుగుణంగా ఆయన చురుగ్గానే పనిచేస్తున్నారు. ఇంకోవైపు మాజీ సమన్వయకర్త అశోక్‌బాబు చివరలో వైసీపీకి మద్దతు ఇచ్చి తానున్నానంటూ ఆయనా తిరుగుతున్నారు. ఆయన వద్దకు కూడా కొందరు కార్యకర్తలు వెళ్తున్నారు. ఈ గందరగోళాన్ని వదిలేసి ఆ నియోజకవర్గానికి చెందిన ఎక్కువ మంది అటు ఎంపీ మాగుంట, ఇటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఇక సీనియర్‌ అయిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిపై ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా ముందడుగు వేసే తత్వం కలిగిన వారు కావడంతో ఎవ్వరూ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. చీరాల, పర్చూరు, అద్దంకిల్లో పార్టీ తరఫున పోటీచేసి ఓటమి చెందిన వారు ఇన్‌చార్జిలుగా వ్యవహరించే అవకాశం ఉండటంతో వారి చుట్టూ తిరుగుతున్నారు.

(లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: June 12, 2019, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading