విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ముందుండి పోరాడాలని వైఎస్ఆర్సీపీ (YSRCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Krishnam Raju) అన్నారు. ఈ అంశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన కామెంట్స్ ను రఘురామ సమర్ధించారు. అలాగే రాజధాని రైతుల పాదయాత్రపై కుట్రపూరిత దాడి జరిగే అవకాశముందన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా వారికి సంబంధించిన రెండు రోజుల ఖర్చు కోసం రూ.2లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. అలాగే రైతులపై దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించారు. రైతులు ప్రతి ఒక్కర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక రాష్ట్రప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరు వాడటం దుర్మార్గమని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సమయానికంటే ముందే గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారన్న రిమాండ్ రిపోర్ట్ పై రఘురామ స్పందించారు. సీఐడీలో ఉన్న ఓ పోలీస్ అధికారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఆర్పీఎఫ్ రక్షణలో ఉన్న వ్యక్తిపై ఎలా దాడి చేశారో చెప్పాలన్నారు. దీన్నిబట్టి చూస్తే పోలీస్ శాఖ ఎలా పనిచేస్తుందో అర్ధమవుతోందన్నారు. ఇదే తరహా దాడులు రాజధాని రైతుల మహాపాదయాత్రపైనా జరిగే అవకాశముందన్నారాయన. కావున రైతులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రప్రభుత్వం కేవలం ధనాపేక్షతోనే ఎయిడెడ్ స్కూళ్లను బలంవంతంగా స్వాధీనం చేసుకుంటోందని రఘురామ ఆరోపించారు. నిర్వహణ భారంతో రాష్ట్రంలో ఏ ఎయిడెడ్ విద్యాసంస్థలు మూసేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను పారదర్శకత లేకుండా ఎంపిక చేశారన్న విమర్శలు కూడా వస్తున్నాయన్నారు. ఈ ఆవార్డులు ప్రభుత్వ నిధులతో కాకుండా ముఖ్యమంత్రి సొంత నిధులతో ఇస్తే బాగుండేదన్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సభపై రఘురామ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాల్సిన బాధ్యత నూటికి నూరుశాతం వైసీపీదేనన్న రఘురామ కృష్ణం రాజు.. స్టీల్ ప్లాంట్ కోసం జగన్ ఒక్కసారైనా రోడ్డెక్కారా..? అని ప్రశ్నించారు. ఇక శాసన మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మండలి ఎన్నికలు నిర్వహించాలని సీఈసీని ఎలా కోరతారని రఘురామ నిలదీశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తప్పేం లేదన్న రఘురామ.. ఈ విషయంలో వైసీపీ తీవ్రంగా పోరాడాల్సి ఉందన్నారు. సీఎం జగన్ దీన్ని పర్సనల్ గా టేకప్ చేస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందన్నారు.
సీఎంకు కడప స్టీల్ ప్లాంట్ పై ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కుపై లేదన్నారు. సీఎంకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఢిల్లీ తీసుకెళ్లాలన్నారు. ఢిల్లీ వెళ్లి పోరాడాల్సిన అవసరం పవన్ కల్యాణ్ కు ఏంటని ప్రశ్నించారు. మొక్కుబడిగా లేఖరాస్తే పనులు జరగవని.. ప్రత్యంగా పోరాడాల్సిన అవసరముందన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో పోరాడదాం రావాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju, Pawan kalyan, Vizag Steel Plant