ఫ్యాన్ స్పీడ్ @130... వైసీపీ శ్రేణుల లెక్కలివే...

ప్రస్తుతం కనిపిస్తున్న జగన్ వేవ్ పోలింగ్ లో కూడా కనిపిస్తే ఇక జగన్ కు ఏ మాత్రం తిరుగు ఉండదన్నారు. అలా జరిగితే వైసీపీ 130 సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదన్నారు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్న విషయం తేలాలంటే ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.

news18-telugu
Updated: April 15, 2019, 4:08 PM IST
ఫ్యాన్ స్పీడ్ @130... వైసీపీ శ్రేణుల లెక్కలివే...
jagan
  • Share this:
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఫలితాలపై గంపెడాశలు పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రధాన పార్టీలు మే 23 కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.  పోలింగ్ పూర్తయిందే తడవుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి శుభాభినందనలు తెలపడంతో పాటు “ఆంధ్రప్రదేశ్ కు ఉత్తమమైన ముఖ్యమంత్రిగా ఉండండి” అని ఆకాంక్షించారు. ప్రశాంత్ కిషోర్ అభినందనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విజయంపై పూర్తి స్థాయి విశ్వాసం ఏర్పడింది. గెలిచిపోతున్నామనే ధీమాతో ముందస్తు సంభరాలు కూడా చేసుకుంటున్నారు పార్టీ శ్రేణులు, నాయకులు. మరి కొంత మంది నాయకులైతే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని తమకు ఏయే శాఖతో మంత్రి వర్గంలో చోటు దక్కుతుందో అని కూడా లెక్కలు వేసుకుంటున్నారు.

“జగన్ నాకు హోం మంత్రిత్వ శాఖ ఇస్తారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చి సముచితంగా గౌరవించారు. అదే మర్యాద జగన్ కూడా కొనసాగిస్తారు.” అని సినీనటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఓ నాయకురాలు తమ మనసులో మాట న్యూస్ 18తో పంచుకున్నారు. వాస్తవానికి ఎన్నికలు పూర్తి కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి హైప్ వచ్చింది. గెలిచిపోతుందనే వాతావరణం కూడా కనిపిస్తోంది. పార్టీ అంతర్గత సర్వేలు కూడా జగన్ పార్టీకి 175 నియోజకవర్గాల్లో 115 పైగా స్థానాలు వస్తాయని అంచనా వేశాయి.

జగన్ కు ఆయన పార్టీకి ఇంతటి హైప్ రావడానికి రకరకాల కారణాలున్నాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పార్టీ సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో వినియోగించుకుంది. జగన్ పై రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే పాటను యూట్యూబ్ లో రెండు కోట్ల మందికి పైగా వీక్షించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టీడీపీ విధానాలను తూర్పారబట్టడం.. జగన్ ను ప్రమోట్ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా జగన్ దాదాపుగా ఏఢాది కాలం పాటు పాదయత్ర చేశారు. 3600 కిలోమీటర్ల పైగా చేపట్టిన పాదయాత్రలో జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. దీంతోపాటు పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రకటించిన ‘నవరత్నాలు’, ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మానిఫెస్టే వైసీపీకి అదనపు హంగులు అద్దాయి.

హంగూ ఆర్భాటాల సంగతి అటుంచితే జగన్ విజయం సాధించడం అంత సులభం కాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజలు జగన్ తో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే ఆ ఓట్లు మొత్తం జగన్ కు పడలేదని విశ్లేషిస్తున్నారు. “జగన్ పై ఉన్న సీబీఐ కేసుల దృష్ట్యా చదువుకున్న పట్టణ ఓటర్లు జగన్ కు వేయలేదు. వీరికి తక్షణ లబ్ధి చేకూర్చే తాయిలాల కంటే దీర్ఘకాలికంగా ప్రభావం చూపే అభివృద్ధే కావాలని కోరుకున్నారు. అందుకే చంద్రబాబుకు ఓటేశారు.” విజయవాడకు చెందిన పాత్రికేయుడు అనిల్ కుమార్ అభిప్రయపడ్డారు.

అంతేకాదు... చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ తదితర పథకాలకు సంబంధించిన కిస్తీ సొమ్ము ఎన్నికలకు కొద్ది రోజుల ముందే డ్వాక్రా మహిళలు, రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిందని చెప్పారు. దీని ప్రభావం కచ్చితంగా గ్రామీణ ఓట్లపై కూడా ఉంటుందని చెప్పారు.

కానీ ఎప్పుడూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడే చంద్రబాబులో మాత్రం మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఆయన హావభావాలు, ముఖ కవళికలు మళ్లీ విజయం సాధిస్తామన్న విశ్వాసం ప్రకటించడం లేదు. అంతే కాకుండా ఎన్నికలు పూర్తయిందే తడవుగా చంద్రబాబు ఈవీఎంలలో అక్రమాలంటూ ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత కర్నాకటలో ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్లారు.“ఆయన ఎప్పుడూ అంతే... ఏదీ ముఖంలో కనిపించనీయరు. 2014లో గెలుస్తామనే నమ్మకం చంద్రబాబులోనూ, టీడీపీ శ్రేణుల్లో ఎక్కడా కనిపించలేదు. ఫలితాలు వెలుడగానే కలా.. నిజమా అనుకుండా గిల్లి చూసుకున్నంత పని చేశారు.” అని సీనియర్ పాత్రికేయులు సుబ్రహ్మణ్యం అన్నారు. టీడీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరనైన మెజారిటీ వస్తుందని చెప్పారు. మరోవైపు.. ప్రస్తుతం కనిపిస్తున్న జగన్ వేవ్ పోలింగ్ లో కూడా కనిపిస్తే ఇక జగన్ కు ఏ మాత్రం తిరుగు ఉండదన్నారు. అలా జరిగితే వైసీపీ 130 సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదన్నారు.  ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్న విషయం తేలాలంటే ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.

(పీవీ. రమణ కుమార్, అసిస్టెంట్ ఎడిటర్, న్యూస్ 18)
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు