చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు వైసీీపీ కొత్త రాగం...

అమరావతిపై ఏపీ ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఇరుకున పెట్టేలా కొత్తరాగం అందుకుంది.

news18-telugu
Updated: November 29, 2019, 9:11 PM IST
చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు వైసీీపీ కొత్త రాగం...
చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
అమరావతిపై ఏపీ ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఇరుకున పెట్టేలా కొత్తరాగం అందుకుంది. నిన్న అమరావతి పర్యటన నేపథ్యంలో చంద్రబాబు చేసిన విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు అమరావతిలో ఏ ఒక్క కట్టడాన్నీ వందశాతం పూర్తి చేయలేదని, ఒక్క హైకోర్టును మాత్రమే 90 శాతం పూర్తిగా కట్టారన్నారు. ఆ హైకోర్టును కూడా ఓటుకు నోటు కేసు విచారణ భయంతోనే కట్టారని చేశారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా అన్న చర్చ మొదలైంది.

ఏపీ రాజధాని అమరావతి విషయంలో తమను తరచూ ఇబ్బంది పెడుతున్న విపక్ష నేత చంద్రబాబును ఇరుకునపెట్టేందుకు జగన్ సర్కారు వ్యూహం మార్చింది. ఇన్నాళ్లూ చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అమరావతికి పారిపోయి వచ్చిన దొంగ అంటూ విమర్శలు చేస్తూ వచ్చిన మంత్రులు.. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మరింత మందుకు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. నిన్న అమరావతిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎదురైన పరిస్దితులు, చంద్రబాబు వ్యాఖ్యలపై ఇవాళ సచివాలయంలో స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు రాజధానిలో ఏ ఒక్క కట్టడాన్నీ వందశాతం పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు కట్టారని చెబుతున్న హైకోర్టు భవనం కూడా 90 శాతమే పూర్తయిందన్నారు. అది కూడా ఓటుకు నోటు కేసు విచారణ భయంతోనే అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

2015లో ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించిన నేపథ్యంలో అరెస్టు భయంతో చంద్రబాబు అమరావతికి వచ్చి తలదాచుకున్నట్లు ఇన్నాళ్లూ వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందన్న భయంతో పాటు మరికొన్ని కారణాలతో చంద్రబాబు అమరావతికి తరలివచ్చినట్లు మాత్రం టీడీపీ చెప్పుకుంది. అయితే పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన హైదరాబాద్ ను వదిలిపెట్టి అమరావతికి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో వచ్చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని హడావిడిగా తరలించడం వల్ల భాగ్యనగరంపై ఏపీకి ఉన్న హక్కు కోల్పోయినట్లయింది. అదే సమయంలో హైదరాబాద్ హైకోర్టు విభజన జరగకపోవడంతో చంద్రబాబుపై ఏసీబీ నమోదు చేసిన ఓటుకు నోటు కేసు విచారణలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కనిపించింది. అయితే ఓవైపు తెలంగాణ విభజన పూర్తయినా హైదరాబాద్ విడిపోలేదన్న తెలంగాణ న్యాయవాదుల ఒత్తిడి, కేంద్రం నుంచి కూడా ఒత్తిడి నేపథ్యంలో చివరికి ఏపీ హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు అధికారంలో ఉండగానే ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైంది.

ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు వెనుక ఓటుకు నోటు కేసు వ్యవహారం ఉందా, లేదా అన్న అంశంపై అప్పట్లో ఎలాంటి చర్చా జరగలేదు. అప్పట్లో వైసీపీ నేతలు కూడా ఈ ఆరోపణ చేయలేదు. కానీ తాజాగా అమరావతిపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ ఈ వ్యూహాన్ని ఎంచుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్ 18)
First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>