రఘు రామకృష్ణంరాజుపై వేటుకు రంగం సిద్ధం... ఢిల్లీ రూట్‌లో వైసీపీ ఎంపీలు..

రఘురామకృష్ణంరాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

Raghu Ramakrishnam Raju | వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద వేటు వేయించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

  • Share this:
    YSRCP MPs Delhi tour | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈనెల 3న ఢిల్లీకి వెళ్లనున్నారు. వైసీపీ ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనుంది. వైసీపీ లోక్ సభ ఎంపీలతో పాటు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు ఢిల్లీకి వెళ్లి లోక్ సభ స్పీకర్‌ను కలిశారు. వైసీపీలో కొందరు తన దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారని, తనను నియోజకవర్గానికి రానివ్వబోమంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారని, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ కేంద్రం బలగాలతో రక్షణ కల్పించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. అలాగే, కొన్ని రోజుల క్రితం వెళ్లి కలిశారు.

    అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు. తనకు విజయసాయిరెడ్డి నోటీసు పంపారని, మన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే లెటర్ హెడ్ మీద నోటీసు పంపారని గుర్తు చేశారు. తాను పార్టీని ఎక్కడా విమర్శించలేదని, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, మంత్రులుచెప్పిన వాటినే తాను కూడా చెప్పానన్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన మీద అనర్హత వేటు వేయించేందుకే ఎంపీలు ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.

    రెండు రోజుల క్రితం మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే... ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దయ్యేలా చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. బాలశౌరి కేంద్ర పెద్దలతో వరుసగా సమావేశం కావడం వెనుక అసలు కారణంగా కూడా ఇదేననే ప్రచారం జరుగుతోంది. గతంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జేడీయూ ఎంపీ శరద్ యాదవ్‌పై రాజ్యసభలో వేటు పడిన విషయాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం. అదే రకంగా రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించాలనే ప్రయత్నాల్లో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.
    First published: