ఏపీలో బీజేపీ రాజకీయం... జగన్‌ను టార్గెట్ చేస్తున్న మోదీ సర్కార్?

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భుజంపై చేయి వేసిన ‘రాజు గారూ’ అంటూ అప్యాయంగా పలకరించడంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ మొదలయ్యింది.

news18-telugu
Updated: November 23, 2019, 9:39 AM IST
ఏపీలో బీజేపీ రాజకీయం... జగన్‌ను టార్గెట్ చేస్తున్న మోదీ సర్కార్?
జగన్, మోదీ
  • Share this:
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీని టార్గెట్ చేస్తూ.. జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంటే...అటు బీజేపీ వైసీపీని టార్గెట్ చేస్తూ రాజకీయ చదరంగాన్ని మరింత రంజుగా మారుస్తోంది. జగన్‌కు సొంత పార్టీలోనే అసమ్మతి రేకెత్తించేలా కమలనాథులు ప్రణాళికలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జగన్ పార్టీ ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఎంపీలు.. ఈ మేరకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయితే తాను సీఎంతో మాట్లాడతానని సాయిరెడ్డి వాళ్లకు హామీ కూడా ఇచ్చారు. మరోవైపు కొందరు వైసీపీ ఎంపీలు... ఢిల్లీలో సొంత కుంపటి పెట్టుకొని కేంద్రమంత్రులతో లంచ్‌లు, డిన్నర్లు, బ్రేక్ ఫాస్ట్ మీటింగ్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కొందరు పార్టీ అనుమతి లేకుండా ప్రధాని మోదీని సైతం కలుస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పట్ల సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. అవసరమైతే సదరు ఎంపీలకు షోకాజ్ నోటీసులు ఇస్తామని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు సార్లు ప్రధాని మోదీని కలుసుకున్న ఆ ఎంపీలు నేరుగా కేంద్ర మంత్రులతో పాటు... ప్రధాన మంత్రి కార్యాలయంతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే తన అనుమతి లేకుండా ప్రధానిని కలవొద్దన్న జగన్ కండిషన్ పట్ల వైసీపీ ఎంపీలు అలక వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించాయి. వైసీపీ నుంచి పలువురు ఎంపీలు, టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ సుజనా చేసిన వ్యాఖ్యలు జగన్ పార్టీలో మరింత కలకలాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఆ ఎంపీలు ఎవరన్న విషయాన్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు. సమయం వచ్చినప్పుడు వారిని పార్టీలోకి చేర్చుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారం చేపట్టే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందన్నారు.

మరోవైపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోదీ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భుజంపై చేయి వేసిన ‘రాజు గారూ’ అంటూ అప్యాయంగా పలకరించడంపైచర్చ మొదలయ్యింది. మరోవైప సుజనా చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో గట్టిగా కౌంటర్ ఇవ్వడం కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ముందు ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.

First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>