వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం.. చంద్రబాబు, లోకేష్ టార్గెట్‌గా సీబీఐ అస్త్రం

గతంలో సీఆర్డీఏ, ఏపీ ఫైబర్‌నెట్‌‌లో జరిగిన అవినీతి సాధారణ కుంభకోణాలు కావని... వాటి వెనక చంద్రబాబుకు సన్నిహితులైన వారు చాలా మంది ఉన్నారని వైసీపీ నేతలు మండపడుతున్నారు.

news18-telugu
Updated: September 15, 2020, 9:30 AM IST
వైసీపీ ఎంపీల కీలక నిర్ణయం.. చంద్రబాబు, లోకేష్ టార్గెట్‌గా సీబీఐ అస్త్రం
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్
  • Share this:
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్‌ వేదికగా గళం విప్పాలని నిర్ణయించారు. సీఆర్డీఏ అక్రమాలు, ఫైబర్ నెట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమయ్యారు. సీఆర్‌డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని, రికార్డులు కూడా తారుమారు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అటు ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (APSFL)లో అవినీతి చోటుచేసుకుందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ రెండింటిపై సీబీఐ దర్యాప్తు కోరాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించినట్టు సమాచారం. గతంలోనే వైఎస్సార్‌సీపీ సీబీఐ దర్యాప్తు కోరినా.. కేంద్రం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంపై వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో దీనిపై గట్టిగా నిలదీయాలని నిర్ణయించుకున్నారు.


గతంలో సీఆర్డీఏ, ఏపీ ఫైబర్‌నెట్‌‌లో జరిగిన అవినీతి సాధారణ కుంభకోణాలు కావని... వాటి వెనక చంద్రబాబుకు సన్నిహితులైన వారు చాలా మంది ఉన్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో నారా లోకేష్ ఐటీ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ అనినీతిలో ఆయన హస్తముందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిగితే పెద్దల హస్తం బయటపడుతుందని.. అన్ని నిజాలు బయటకొస్తాయని వెల్లడించారు.

మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా తమ వ్యూహాన్ని సిద్ధం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శితో సోమవారం రాత్రి టీడీపీ ఎంపీ సమావేశమయ్యారు. ఏపీ మూడు రాజధానుల అంశంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై వివరణ కోరారు ఎంపీలు. రాజధాని ఎంపికపై కేంద్రం జోక్యం ఉండదని. అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమావేశం అనంతరం గల్లా జయదేవ్ మీడియాకు తెలిపారు. న్యాయపరమైన అంశాలను హోంశాఖ కార్యదర్శికి వివరించి.. అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేశామని ఎంపీ కనకమేడల తెలిపారు. అంతేకాదు.. జరిగిన పొరపాటును హోంశాఖ కార్యదర్శి గ్రహించారని ఆయన చెప్పుకొచ్చారు.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సభలో గళం విప్పేందుకు టీడీపీ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం హామీలను ప్రస్తావిస్తూ.. అమరావతి శంకుస్థాపనకు మోదీ వచ్చిన విషయాన్ని సభా వేదికగా గుర్తు చేయాలని యోచిస్తున్నారు. అధికారం మారిన ప్రతీసారి రాజధానులను మార్చుతూ పోతే వేల కోట్ల ప్రజాధనం వృథాకావడంతో పాటు రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతుందన్న వాదనను బలంగా వినిపించాలని వ్యూహాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇలా టీడీపీ అవినీతిపై వైసీపీ.. 3 రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ.. ఎవరికి వారు పోటాపోటీగా వ్యూహాలు సిద్ధం చేయడంతో.. ఈ సమావేశాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: September 15, 2020, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading