ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నవరత్నాలులో భాగంగా అమ్మఒడి పథకాన్ని (Ammavodi Scheme) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఏడాదికి రూ.15వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండేళ్లు పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం మూడో ఏడాదికి సంబంధించి స్వల్ప మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలన్న అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. ఏపీలో అమలు జరుగుతున్న అమ్మ ఒడి పథకం దేశమంతటా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (సవరణ) 2020 పేరిట వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యాలయాల్లో నమోదయ్యే విద్యార్ధుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వీలుగా విద్యార్ధి తల్లి లేదా సంరక్షకుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ఈ బిల్లు ఉద్దేశంగా బిల్లును ప్రవేశపెడుతూ ఆయన వెల్లడించారు.
అమ్మఒడితో పాటు నిరుద్యోగ భృతి అంశంపైనా విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు ప్రవశపెట్టారు. దేశంలోని 21 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ (సవరణ) బిల్లును విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
రెండు బిల్లులతో పాటు ప్రార్ధనా మందిరాలు, స్థలాలపై దాడులు చేసి వాటిని అపవిత్రం చేసే నిందితులకు విధించే జైలు గరిష్ట శిక్షను రెండేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళకు పెంచేలా చట్ట సవరణ చేపట్టేందుకు వీలుగా శ్రీ ఇండియన్ పీనల్ కోడ్ (సవరణ) 2021 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వలన టెంపుల్ డిస్ట్రక్షన్ పార్టీ (టీడీపీ) అరాచకాలకు తెరదించి సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చంటూ పరోంగా గతంలో ఏపీలో జరిగిన ఆలయాలపై దాడుల అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో వైసీపీ, టీడీపీ ఎంపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని.. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ లోక్ సభలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ప్రసంగించారంటూ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. భరత్ వ్యాఖ్యలు ఢిల్లీలో ఏపీ పరువు తీశాయని టీడీపీ విమర్శించారు.
ఐతే టీడీపీ ఎంపీల కామెంట్స్ కు ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. తాను అలా అనలేదని.. తాను ఎఫ్ఆర్ఎంబీ పరిమితిని పెంచాలని మాత్రమే కోరానన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తాను మాట్లాడిన వీడియోను.. ఇప్పటి వీడియోకు జతచేసి టీడీపీ ఎంపీలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని భరత్ మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీలో ఏపీ పరువు తీయాలని కంకణం కట్టుకున్నారని ఆయన విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap welfare schemes, Parliament Winter session, Rajyasabha, Vijayasai reddy