ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే... జగన్‌కు దగ్గరగా ఉండే ఇద్దరు నేతల మధ్య ఫైట్

పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి మధ్య వాగ్వాదం

ఒకరు రాజ్యసభ ఎంపీ. మరొకరు ఎమ్మెల్యే. ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

 • Share this:
  ఒకరు రాజ్యసభ ఎంపీ. మరొకరు ఎమ్మెల్యే. ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే, ఆ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. టిడ్కో ఇళ్ల వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాటలయుద్ధానికి కారణమైంది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. అయితే, వెంటనే ద్వారంపూడి జోక్యం చేసుకున్నారు. పిల్లి ఆరోపణలను ఖండించారు. అవినీతికి పాల్పడిన వారి వివరాలు తనకు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందని ఆరోపించారు. ద్వారంపూడి వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. టీడీపీ ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, చినరాజప్ప అభ్యంతరం వ్యక్తం చేశారు.

  ఈ క్రమంలో మరోసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ మెడలైన్ వంతెన గురించి ప్రస్తావించారు. ఈ వంతెన నిర్మాణం విషయంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అభ్యంతరం తెలిపారు. కాకినాడ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా మునిగిపోయే మెడలైన్ వంతెన నిర్మాణాన్ని ఆపేయాలని రాజ్యసభ ఎంపీ సూచించారు. అయితే, దీనిపై కూడా ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం మాటల తూటాలు పేలాయి. ఇద్దరు నేతలు వెనక్కి తగ్గకుండా వాదులాడుకున్నారు. ఈ క్రమలో జిల్లా కలెక్టర్ అర్థంతరంగా డీఆర్సీ సమావేశాన్ని వాయిదా వేశారు.

  కొన్ని రోజుల క్రితం విశాఖలో జరిగిన డీఆర్సీ సమావేశంలో కూడా వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మధ్య మాటల యుద్దం జరిగింది. పాలవలసలో భూ అక్రమాలను ఉద్దేశించి విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. కరణం ధర్మశ్రీ అభ్యంతరంత తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. పదే పదే రాజకీయ నేతల అవినీతి అని ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నిజాయితీపరుడునని, కావాలంటే విచారణ జరిపించాలని సభలో ధర్మశ్రీ వాగ్వాదానికి దిగారు. పాలవలస భూముల వ్యవహారంలో ఎన్‌వోసి చట్టబద్దత ఉంటే ఇవ్వాలని.. లేకుంటే లేదని వాదించారు. పదే పదే అవినీతిపరులని వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ విశాఖ నేతలను పిలిపించి మాట్లాడారు. విబేధాలు ఉంటే సర్దిచెప్పాలి కానీ, బహిరంగంగా మాట్లాడవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.

  ఇటీవల అధికార పార్టీలో నేతల మధ్య యుద్ధం ఎక్కువగా జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, వైసీపీలో ముందు నుంచి ఉన్న నేతల మధ్య కూడా వార్ జరుగుతోంది. రెండు వర్గాల నేతలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఎత్తులు పై ఎత్తులతో నియోజకవర్గాల్లో వాడివేడి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇతర వైసీపీ నేతలు దుట్టా, యార్లగడ్డ మధ్య వార్ జరుగుతోంది. సాక్షాత్తూ జగన్ వారిద్దరికీ సర్ది చెప్పి, చేతిలో చెయ్యి కలిపి ఇద్దరూ సయోధ్యతో నడవాలని చెప్పిన తర్వాత కూడా వారు ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: