చంద్రబాబుపై సీబీఐ విచారణ... పార్లమెంట్‌లో వైసీపీ డిమాండ్...

సీఎం జగన్, చంద్రబాబునాయుడు

అమరావతిలో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని... దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరపాలని పార్లమెంట్ సాక్షిగా వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ మేరకు లోక్‌సభలో డిమాండ్ చేశారు.

 • Share this:
  అమరావతిలో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని... దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరపాలని పార్లమెంట్ సాక్షిగా వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ మేరకు లోక్‌సభలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమరావతి అంశాన్ని లేవనెత్తారు. అమరావతి వేదికగా భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మొదట విజయవాడ సమీపంలోని తిరువూరు రాజధాని అవుతుందని ప్రకటించిన చంద్రబాబునాయుడు, ఆ తర్వాత మూడు నెలల్లోనే మాట మార్చారని, విజయవాడ - గుంటూరు మధ్యన ఉన్న అమరావతిని రాజధాని చేస్తున్నట్టు ప్రకటించారని ఆరోపించారు. అయితే, ఈ మూడు నెలల్లో భారీ ఎత్తున టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ప్రాధమిక నివేదిక ప్రకారం సుమారు 4వేల ఎకరాలకు పైగా భూములను టీడీపీ నేతలు బినామీ పేర్లతో కొనుగోలుచేశారని ఆరోపించారు.

  ఇది ప్రజలను మోసం చేయడం. అమరావతిలో రాజధాని పెద్ద స్కాం. ఈ విషయాన్ని ప్రాథమిక రిపోర్టులు చెబుతున్నాయి. బీపీఎల్ కోటాలో ఉన్న 780 మంది కోట్లాది రూపాయల విలువైన భూములను కొన్నారు. వారంతా తప్పుడు ధ్రువపత్రాలతో భూములను కొనుగోలు చేశారు. ఈ విషయంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ మీద కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరపాలి. మొత్తం స్కాం బయటకు రావాలి.
  మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ


  అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారి పేరుతో కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను సిద్ధం చేసి ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. అందులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పేర్లు కూడా ఉన్నాయి. వీరితో పాటు ఎవరెవరు ఏయే పేర్లతో భూములను కొనుగోలు చేశారో తెలియజేస్తూ మరికొన్ని పేర్లను కూడా జోడించింది. అందులో మాజీ మంత్రి నారాయణ, కొమ్మాల పాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను కూడా అందులో పొందుపరిచింది. సీఆర్డీఏ సరిహద్దులను మార్చడం ద్వారా టీడీపీకి చెందిన మరికొందరు నేతలు, కంపెనీలకు లబ్ధి చేకూర్చిందంటూ మరో లిస్టును పొందుపరిచింది. టీడీపీ ప్రభుత్వం ఐదు సంస్థలకు 850 ఎకరాల భూములను కేటాయించిందని, అందులో కూడా భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని కేబినెట్ సబ్ కమిటీ తమ రిపోర్టులో పొందుపరిచింది.

  ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో చంద్రబాబు, నారా లోకేష్ పేర్లు


  అమరావతిలో ఇన్ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతలు సుమారు 4069.94 ఎకరాలను ముందస్తుగానే కొనుగోలు చేశారని కేబినెట్ సబ్ కమిటీ నివేదికలో పొందుపరిచింది. ఇటీవలే దీనిపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు సమగ్రంగా విచారణ జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. దానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారు. తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు. అయితే, ఇప్పటి వరకు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేసిన వైసీపీ.. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకించి సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: