మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. నీకు మెంటలా అంటూ సీఐకి వార్నింగ్.. ఆడియో వైరల్

తాను తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్‌పై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.

news18-telugu
Updated: September 19, 2020, 7:00 AM IST
మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి.. నీకు మెంటలా అంటూ సీఐకి వార్నింగ్.. ఆడియో వైరల్
ఉండవల్లి శ్రీదేవి
  • Share this:
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. పోలీస్ అధికారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు శ్రీదేవి పేరుతో ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. అందులో సీఐని నోటికొట్టినట్లు ఆమె దూషించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పట్టుకున్నందుకు సీఐకి చివాట్లు పెట్టారు. వాళ్లు నా మనషులు.. వదలిపెడతావా? లేదా? అంటూ హెచ్చరించారు. తాను తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ మండిపడ్డారు శ్రీదేవి. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్‌పై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.

ఫోన్ సంభాషణ:

హలో.. ఎప్పటి నుంచి చెప్తున్నా? వాళ్లను పంపేయొచ్చుగా.. నీకేమైనా మెంటలా? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్. నేనంటే రెస్పెక్ట్ లేదా? అందరినీ వదిలిపెడతావ్. మా వాళ్లని వదలిపెట్టవా..? నాన్సెన్స్.. అసలు నీవు పంపిస్తావా? లేదా చెప్పు. నా కాళ్లు పట్టుకుని ఇక్కడికి పోస్టింగ్ తెచ్చుకున్నావ్. చెప్పింది చేస్తానని ఆ రోజు చెప్పావు. ఇప్పుడు ఎమ్మెల్యేనని చూడకుండా కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నావ్. నేను తలచుకుంటే రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్.. ఎక్స్‌ట్రాలు చేయొద్దు..వారిని వదిలిపెట్టు. లేదంటే ఎస్పీకి, డీజీపీకి చెబుతా.. అని ఆ ఆడియో క్లిప్‌లో ఉంది.

ఐతే అక్రమంగా మట్టి, ఇసుక తరలించడానికి వీల్లేదని సీఐ చెబుతున్నట్లు ఆడియోలో ఉంది. అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై ఉక్కుపాదం మోపడం..ప్రభుత్వ పాలసీ అని, ఇలా చేస్తే మీకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐతే నా మాటంటే నీకు లెక్కలేదా అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నట్లుగా అందులో ఉంది. ఈ ఆడియోపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులను బెదిరించడమేమంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

కాగా, ఎమ్మెల్యే శ్రీదేవి తనను మోసం చేసిందని ఇటీవల వైసీపీ నేత మేకల రవి సెల్ఫీ వీడియో చేయడం దుమారం రేపిన విషయం తెలిసిందే. తన భర్త మోసం చేసాడని చెప్పి.. రూ.1.40 కోట్లు తీసుకుందని ఆరోపించారు. ఇప్పటి వరకు రూ.40 లక్షలు ఇచ్చిందని.. మిగిలిన రూ.80 లక్షలు ఇవ్వడం లేదని వాపోయారు. డబ్బుల కోసం ఇంటికెళ్తే దుర్భాషలాడారని.. డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలని చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు పేకాట నిర్వహణలో ఎమ్మెల్యే హస్తముందని విమర్శలు వచ్చాయి. ఐతే తనపై ప్రత్యర్థులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి ఖండించారు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading