జూదాంధ్రప్రదేశ్‌గా ఏపీ, వైసీపీ మహిళా ఎమ్మెల్యే పేకాట క్లబ్‌లు: అనిత

వైసీపీ శాసనసభ్యులు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

news18-telugu
Updated: November 7, 2020, 3:39 PM IST
జూదాంధ్రప్రదేశ్‌గా ఏపీ, వైసీపీ మహిళా ఎమ్మెల్యే పేకాట క్లబ్‌లు: అనిత
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ శాసనసభ్యులు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు కుటుంబ సభ్యులు పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న విషయం సాక్ష్యాధారాలతో సహా బహిర్గతమైన విషయం మర్చిపోకముందే తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ లో భాగోతం ఆధారాలతో బయటకు వచ్చిందన్నారు. వైసీపీ నాయకులు చేత పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి అనర్హురాలని అనిత అన్నారు. ‘మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న శ్రీదేవి ఆడియో క్లిప్పింగ్స్ పై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలి. పేకాట క్లబ్ లు నిర్వహించమని స్వయంగా ఎమ్మెల్యేనే ఆదేశాలు జారీ చేయడంపై ముఖ్యమంత్రి స్పందించాలి. వాటాల పంపిణీలో తేడాలు రావడంతో ప్రాణ హాని ఉందంటూ కొత్త నాటకానికి శ్రీదేవి శ్రీకారం చుట్టారు. గౌరవ ప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి పేకాట క్లబ్ లు నిర్వహించడం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనం. ఊరూరా పేకాట క్లబ్ లు ఏర్పాటు చేసి ప్రజలను గుల్ల చేస్తున్నారు. అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని, సచివాలయాన్ని పేకాట క్లబ్ లుగా మార్చేందుకు శ్రీదేవి సిద్దంగా ఉన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా పేకాట క్లబ్ ల పై దృష్టి పెడుతున్నారు. వెంటనే ఉండవల్లి శ్రీదేవిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.’ అని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరించిన చలివేంద్రపు సురేష్, శృంగారపాటి సందీప్‌ల నుంచి తనకు ప్రాణాహాని ఉందని శ్రీదేవి ఆరోపించారు. వారిద్దరు తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నారని ఆమె గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. సందీప్‌, సురేష్‌ చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారని శ్రీదేవి గుర్తుచేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిని వైసీపీ మండల పార్టీ నాయకులు వారిద్దరిని పార్టీ నుంచి బహష్కించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సురేష్, సందీప్‌లు తనపై బెదిరిపులకు పాల్పడుతున్నారని శ్రీదేవి తెలిపారు. ఫోన్‌లో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తన గొంతు మార్ఫింగ్ చేసి మాట్లాడుతూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బయటకు వెళ్లినప్పుడ వెంటపడుతూ ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారని ఆరోపించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇక, ఎమ్మెల్యే శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని చెప్పారు.

అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదంలో చిక్కుకున్నారు. పోలీస్ అధికారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు శ్రీదేవి పేరుతో ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. అందులో సీఐని నోటికొట్టినట్లు ఆమె దూషించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పట్టుకున్నందుకు సీఐకి చివాట్లు పెట్టారు. వాళ్లు నా మనషులు.. వదలిపెడతావా? లేదా? అంటూ హెచ్చరించారు. తాను తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ మండిపడ్డారు శ్రీదేవి.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 7, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading