ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేయడంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మిగతా నేతలకంటే కాస్త ముందుంటారు. తాజాగా వైసీపీపై విమర్శలు చేసిన సీపీఐ సీనియర్ నేత నారాయణపై రోజా సెటైర్లు వేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కమ్యూనిస్టులు ధర్నా చేయకుండానే పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని రోజా అన్నారు. సీపీఐ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇలా చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేసే స్థలం అంత కూడా లేదని సీపీఐ నేత నారాయణ విమర్శించడాన్ని రోజా తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలందరి శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని.. సీపీఐ నారాయణ కనీసం తన సొంత ప్రాంతమైన నగరి నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేదని మండిపడ్డారు.
కమ్యూనిస్టులంటే పేదల కోసం పని చేస్తారని... కానీ ఏపీలో మాత్రం కొందరు కమ్యూనిస్టులు చంద్రబాబు కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసని... కానీ ఏపీలో మాత్రం సీపీఐ అంటే చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చేశారని రోజా విమర్శించారు. సీపీఐ నేతలు చంద్రబాబు జెండా మోస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్ను విమర్శించడం సరికాదని.. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని రోజా నారాయణకు సూచించారు.
ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపై కూడా రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు స్పందించిన రోజా.. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు అడ్డంగా బలిసిన వాళ్లకు ఇచ్చే ఇళ్లు కాదని.. అట్టడుగున ఉన్న పేదల కోసం ఇస్తున్న ఇళ్లు అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో పేదలకు ఈ రకమైన మేలు చేద్దామనే ఆలోచన ఎప్పుడైనా చేశారా ? అని ప్రశ్నించారు. వయసులో చిన్నవాడైన సీఎం జగన్ పెద్ద మనసులో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని రోజా కొనియాడారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.