మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekanandra Reddy Murder Case) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) కాకరేపుతున్న సంగతి తెలిసిందే. వివేకా హత్యపై ఆయన డ్రైవర్ దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, దెవిరెడ్డి శంకర్ రెడ్డి పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. ఐతే దీనిపై కడప జిల్లా ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివారెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని సీబీఐ నిరూపిస్తే జిల్లాలో తనతో పాటు మరో 9మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు.
హత్యకు ఇవే కారణాలు..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన కారణాలు డబ్బు, అవమానం, వ్యక్తిగత బలహీనతలే తప్ప మరొకటికాదన్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యావ్, ఉమామహేశ్వర్ రెడ్డి, దస్తగిరే హత్యకు కారకులని ఆయన అన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మొదట పోలులు, సిట్, సీబీఐ దర్యాప్తులో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన 161 స్టేట్ మెంట్ లో ఎంపీ అవినాష్ రెడ్డి, కుటుంబ సభ్యుల పేర్లు లేవన్న శివప్రసాద్ రెడ్డి.. ఆ తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో ఇచ్చిన 164 స్టేట్ మెంట్లో అవినాష్ రెడ్డి సహా భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి పేర్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు స్టేట్ మెంట్లకు అసలు పొంతనే లేదని ఎమ్మెల్యే అన్నారు.
హత్యలో పాల్గొన్నట్లు స్వయంగా దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు అరెస్ట్ చేయలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐని ప్రశ్నించారు. ముద్దాయిని సాక్షిగా మార్చేందుకు సీబీఐ యత్నించడం సబబు కాదన్నారు. ఇదిలా ఉంటే ప్రొద్దుటూరు కోర్టులో సీబీఐ దాఖలు చేసిన అప్రూవర్ పిటిషన్ కు కౌంటర్ గా న్యాయవాదులు నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
జగన్ ను విచారించాలి: పట్టాభి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి హస్తముందని.. సీఎం జగన్ అండతోనే ఈ హత్య జరిగిందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఆరోపించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వెనుక ఉండి శంకర్ రెడ్డిని నడిపించారని.. వీరికి సీఎం జగన్ సపోర్ట్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీబీఐ వైఎస్ అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డి విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే కుట్రపూరితంగా సిట్ ను మార్చడమే కాకుండా దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేసిన సీఎం జగన్ ను కూడా విచారించాలని పట్టాభి డిమాండ్ చేశారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CBI, YS Avinash Reddy, Ys viveka murder case, Ysrcp