news18-telugu
Updated: December 2, 2020, 10:26 PM IST
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, రైతులతో మాట్లాడుతున్న జనసేనాని (Image; Janasena Party/Twitter)
నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. తొలిరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుతో పాటు, పామర్రు, మోపిదేవి, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం గుంటూరు జిల్లా భట్టిప్రోలు, చావలి, పెరవలి, తెనాలి ప్రాంతాల్లోనూ పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, కేవలం కష్టాల్లో ఉన్న వారికి భరోసా కల్పించేందుకు వచ్చానని చెప్పారు. హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన వారికి అక్కడి ప్రభుత్వం రూ.10000 సాయం ప్రకటించిందని, ఎకరం పొలం వర్షాలకు పడిపోతే జగన్ ప్రభుత్వం కూడా అదే రూ.10,000 ఇస్తామనడం సరికాదన్నారు. ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30,000 ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో నివర్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు పర్యటించిన పవన్ కళ్యాణ్‌ను వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ పెదరెడ్డయ్య కలిశారు. పెద్దపూడి అడ్డురోడ్డు వద్ద పవన్ కళ్యాణ్‌ను కలిసిన పెదరెడ్డయ్య.. తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలన్నీ తప్పులేనని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. దీనికి రెడ్డయ్య కూడా అంగీకరించారు. తాను కూడా దానికి వస్తానని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ (Image; Twitter)
పెదరెడ్డయ్య యాదవ్ 1991-96 మధ్య మచిలీపట్నం ఎంపీగా సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. 2009 సంవత్సరంలో ఆయన ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు కొలుసు పార్థసారధి ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. పార్థసారధి 2019లో కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 2, 2020, 10:18 PM IST