రాజకీయ ప్రసంగాల్లో నాయకులు నోరు జారడం సర్వసాధారణం. అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన ప్రజాప్రతినిథులు అధికారులపై, పోలీసులపై అసంతృప్తి వెళ్లగక్కడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ ఎమ్మెల్యే ఏకంగా జిల్లా ఎస్పీనే టార్గెట్ చేస్తూ నోటికి పనిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూ జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఎస్పీని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నల్లపురెడ్డి ఎస్పీ భాస్కర్ భూషణ్ పై ఘాటు విమర్శలు చేశారు. ఓ వివాదం విషయంలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయనందుకు పరుష పదజాలంతో దూషించారు. టీడీపీ వాళ్లు చెప్తే కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి నువ్వెవరంటూ తిట్లదండకం ఎత్తుకున్న నల్లపురెడ్డి.., అధికార పార్టీ వాళ్లు చెప్తే కేసు నమోదు చేయగా..? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ఫోన్ చేస్తే కేసు నమోదు చేయకుండా ఉండటానికి నువ్వెవరన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఇలాగే జరుగుతోందా.. ఎస్పీ అనుమతి లేనిదే పెట్టకూడదా? అని ప్రశ్నించారు. ఎస్పీ వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అక్కడితో ఆగని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.., అసలు నువ్వు ఎక్కడి నంచి వచ్చావ్.. నీకు రూల్స్ ఎవరు నేర్పారు? నెల్లూరు జిల్లాలో ఎన్నాళ్లుంటావో చూస్తా.. ఇప్పుడో నెల తర్వాతో వెళ్లక తప్పదని.., వెళ్లే ముందు మంచిపేరు తెచ్చుకకొని వెళ్లాలన్నారు.
క్రమంగా ఎస్పీపై ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఎక్కడి నుంచి వచ్చావు.. ఎవరు నేర్పారు నీకు రూల్స్..,బాగుండదు.. నెల ఉంటావో రెండు నెలలుంటావో.. ఉన్నన్ని రోజులు మంచిపేరు తెచ్చుకో., అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మన ఖర్మకొద్దీ ఆ ఎస్పీ జిల్లాకు వచ్చాడన్న నల్లపురెడ్డి ఏం తమాషాగా ఉందా..? ఎవరు కాపాడతారు నిన్ను.., ? విజయవాడ నుంచి డీజీపీ వచ్చి రక్షిస్తాడనుకున్నావా? బాగుండదు చెప్తున్నా..! అంటూ రెచ్చిపోయారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తే ఎస్సై, సీఐని జైలుకు పంపుతానని ఎస్పీ బెదిరించారని ఆరోపించిన ప్రసన్నకుమార్ రెడ్డి.., ఎస్సై, ఎసీఐ తరపున నేనుంటా.. దమ్ముంటే వారిని అరెస్ట్ చేయించు అని సవాల్ విసిరారు. మాతో పెట్టుకుంటే మర్యాదగా ఉండదని హెచ్చరించారు.
ఓ ఎమ్మెల్యే అయి ఉండి.. జిల్లా పోలీస్ అధికారిని దుర్భాషలాడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ కేసు నమోదు చేయనందుకు ఎస్పీ స్థాయి అధికారిని ఇలా తిట్టిపోయడం సరికాదని పలువురు అంటున్నారు. నల్లపురెడ్డి వైఖరిపై వైసీపీ నేతలే ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.