తుని రైలు దహనం వెనుక ఆ ఇద్దరు మాజీ మంత్రులు.. వైసీపీ సంచలన ఆరోపణ

తుని రైలు దహనం వెనుక అప్పటి ప్రతిపక్ష వైసీపీ హస్తం ఉందని టీడీపీ సర్కారు ఆరోపించింది. కడప నుంచి రౌడీలను దించారంటూ చంద్రబాబునాయుడు ఆరోపించారు.

news18-telugu
Updated: July 13, 2019, 8:32 PM IST
తుని రైలు దహనం వెనుక ఆ ఇద్దరు మాజీ మంత్రులు.. వైసీపీ సంచలన ఆరోపణ
తునిలో తగలబడుతున్న రైలు (File)
news18-telugu
Updated: July 13, 2019, 8:32 PM IST
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ సందర్భంగా తునిలో జరిగిన రైలు దహనం వెనుక అప్పటి మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా ఉన్నారని వైసీపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం విచారణ జరుపుతుందని ప్రకటించారు. కాపులకు వైసీపీ అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని.. తొలి బడ్జెట్లోనే జగన్ మోహన్ రెడ్డి కాపుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించారని దాడిశెట్టి రాజా అన్నారు. కాపు రిజర్వేషన్ కోసం జరిపిన ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను కొట్టేస్తామని ప్రకటించారు. అదే సమయంలో రైలు దహనం వెనుక ఉన్న యనమల, దేవినేని ఉమా మీద విచారణ జరుపుతామన్నారు.

కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. 2016 జనవరిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సభను నిర్వహించారు. ఆ సమయంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ రైలు మీద కొందరు దుండగులు దాడి చేశారు. రైలు బోగీలను దహనం చేశారు. అప్పట్లో ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. అయితే, తుని రైలు దహనం వెనుక అప్పటి ప్రతిపక్ష వైసీపీ హస్తం ఉందని టీడీపీ సర్కారు ఆరోపించింది. కడప నుంచి రౌడీలను దించారంటూ చంద్రబాబునాయుడు ఆరోపించారు. గోదావరి జిల్లాల ప్రజలకు అలాంటి సంస్కృతి లేదని.. కడప నుంచి వచ్చిన వారితోనే రైలును దహనం చేయించారని ఆరోపించారు. ఆ కేసులో దాడిశెట్టి రాజా మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, రైలు దహనం వెనుక యనమల, దేవినేని ఉన్నారని రాజా ఆరోపించడంతో కేసు కొత్తమలుపు తిరిగేలా ఉంది.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...