చంద్రబాబూ ఆ రోజు ఎందుకు జోలె పట్టలేదు? వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న...

సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.. సేవ్‌ అమరావతి అంటున్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా ‘షేవ్‌’ చేశారని అనంత వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: January 11, 2020, 10:27 PM IST
చంద్రబాబూ ఆ రోజు ఎందుకు జోలె పట్టలేదు? వైసీపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న...
అమరావతి పరిరక్షణ కోసం తిరుపతిలో జోలె పట్టిన చంద్రబాబు
  • Share this:
రాయలసీమ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న చంద్రబాబుపై ప్రజలే తిరగబడాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని, వీటిపై స్పష్టమైన ప్రకటన చేశాకే రాయలసీమలో చంద్రబాబు పర్యటించాలని డిమాండ్‌ చేశారు. శనివారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో మాత్రమే అభివృద్ధి కేంద్రీకృతమైందని, మళ్లీ అలాంటి తప్పు జరకూడదన్న ఉద్దేశంతోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన చేస్తున్నారన్నారు. ఈ నెల 13న అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన హాస్యాస్పదమన్నారు. విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధిపై చంద్రబాబు స్టాండ్‌ ఏంటని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా?, విశాఖలో అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలా? వద్దా?, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఉండాలా? వద్దా? అన్న దానిపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీమలో ప్రాజెక్టులు పూర్తి కావడం, ఇక్కడి రైతులకు నీరు అందడం ఆయనకు ఇష్టం లేదా? అని మండిపడ్డారు.

సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.. సేవ్‌ అమరావతి అంటున్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా ‘షేవ్‌’ చేశారని ఎద్దేవా చేశారు. గతంలో మనం ఎంతో నష్టపోయామని, మళ్లీ అలాంటి తప్పు జరగకూడదనే అధికార వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుభవముందని, 14 ఏళ్లు సీఎంగా పని చేశారని చెప్పుకునే చంద్రబాబు గ్రామ స్థాయి నాయకుడిలా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాయలసీమను గానీ తాను ఎమ్మెల్యేగా గెలుస్తున్న కుప్పంను కూడా అభివృద్ధి చేయలేకపోయారన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రం కోసం పని చేస్తున్నారా? లేక అమరావతి కోసం పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం బాబుకు ఇష్టం లేనట్టుగా కనబడుతోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ చంద్రబాబు ఇంతగా గగ్గోలు పెట్టలేదని, అమరావతిలో తన బినామీల భూములు పోతాయన్న ఆలోచన మాత్రమే ఆయనకు ఉందన్నారు. అక్కడి రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయమని స్పష్టం చేశారు.

అమరావతి పేరుతో భిక్షాటన చేస్తున్న చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాయలసీమలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కూలీలు వలస వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. ఆ రోజు జోలె పట్టాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. శ్రీబాగ్‌ ఒప్పందం అమలుపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అమరావతికే పరిమితమా? చంద్రబాబు అమరావతికి మాత్రమే నాయకుడా? అని అన్నారు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే ముఖ్యమైనట్లు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా వ్యతిరేకించడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారన్నారు. సీమలో పర్యటనకు వస్తున్న చంద్రబాబును ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

First published: January 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు