వైసీపీలో ముగిసిన దుమారం... కథ సుఖాంతం

వైసీపీలో ముగిసిన దుమారం... కథ సుఖాంతం

సీఎం జగన్

వైసీపీలో నిన్న మొన్నటి వరకు దుమారం రేపిన నెల్లూరు జిల్లా వ్యవహారం చివరకు సుఖాంతమైంది.

 • Share this:
  వైసీపీలో నిన్న మొన్నటి వరకు దుమారం రేపిన నెల్లూరు జిల్లా వ్యవహారం చివరకు సుఖాంతమైంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆనంను జగన్ వద్దకు తీసుకుని వెళ్లారు. తాను చేసిన ‘మాఫియా’ వ్యాఖ్యల మీద ఆనం రామనారాయణరెడ్డి జగన్‌కు వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

  నెల్లూరు జిల్లాను మాఫియా, కబ్జాకోరుల చేతిలో పెట్టారంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీలో దుమారం రేగింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని విజయసాయిరెడ్డిని ఆదేశించారు. విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా పార్టీ గీతదాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేస్తారనే ప్రచారం జరిగింది.

  అయితే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి తన రాజకీయ చాతుర్యాన్ని చూపించారు. అసెంబ్లీలో రూల్స్ ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని వెనకేసుకొచ్చిన ఆనం.. ప్రతిపక్ష టీడీపీ, చంద్రబాబునాయుడు మీద విమర్శలు గుప్పించారు. దీంతో జగన్ కూడా ఆనం విషయంలో కొంచెం మెత్తబడినట్టు కనిపించారు. ఈ క్రమంలో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బాలినేని నడుం బిగించారు. ఆనంను జగన్ వద్దకు తీసుకుని వెళ్లడంతో కథ సుఖాంతమైంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు