తాను చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. అసలు తాను ఆమె గురించి ఏ రకమైన ప్రస్తావన తీసుకురాలేదని వివరించారు. బాబాయ్ సంగతి, గొడ్డలి గురించి, తల్లి గురించి, చెల్లి గురించి చర్చ జరగాలని చంద్రబాబు అన్నారని.. ఆ సమయంలో తాము కూడా వంగవీటి రంగా హత్య, మాధవరెడ్డి మరణంపై కూడా చర్చ జరగాలని అన్నామని అంబటి రాంబాబు అన్నారు. ఇందులో చంద్రబాబు (Chandrababu) భార్యను అవమానించడమే ప్రస్తావన ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. తాము మాట్లాడిన మాటలను టీడీపీ (tdp) వాళ్లు ఏవేవో ఊహించుకుంటే.. అందుకు తమకేం సంబంధమని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఓ వైపు తనకు పదవులు అక్కర్లేదని చెబుతున్న చంద్రబాబు.. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి తిరిగి వస్తానని అనడం వెనుక అర్థం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబుకు పదవి మాత్రమే ముఖ్యమని.. పదవి కోసం ఆయన ఏమైనా చేస్తారని అన్నారు. ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతున్న చంద్రబాబు.. వారి తప్పుదోవ పట్టించేందుకు భార్య, కొడుకును అడ్డుపెట్టుకోవాలని చూడటం దుర్మార్గమని అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతి చోట తిరస్కరణకు గురవుతున్న చంద్రబాబు.. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇందులో భాగంగానే తప్పు తమపై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.
Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?
K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?
చంద్రబాబు దగ్గర రాజకీయంగా లబ్ది పొందేందుకు ఉన్న అన్ని అస్త్రాలు అయిపోయాయని.. అందుకే చివరి అస్త్రంగా భార్యను అవమానించారనే ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టారని ఆరోపించారు. ఈ రకంగా పార్టీని బతికించుకోవాలని ఆయన చూస్తున్నారని మండిపడ్డారు. తనకు కూడా అర్థంకాని ఏదో అంశం గురించి వాళ్లు మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారని.. అందులో భాగంగానే కన్నీళ్లు పెట్టుకోవడం చేశారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
చంద్రబాబు ఈ రోజు నవరసాలు పండించారని.. అందులో భాగంగా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారేమో అని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు బాధపడితే పడొచ్చని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన బాధపడటంలో తప్పేముందని అన్నారు. అర్థం లేని ఏడుపులను ప్రజలు పట్టించుకోరనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.