• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • YSRCP MAY JOIN NDA 3 MPS MAY GET UNION MINISTER POSTS IN CENTRAL GOVT SK

ఎన్డీయేలోకి వైసీపీ.. ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రిపదవులు..?

ఎన్డీయేలోకి వైసీపీ.. ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రిపదవులు..?

వైఎస్ జగన్, ప్రధాని మోదీ (File photo)

ఎన్డీయేలో చేరికకు సంబంధించి వైసీీపీకి కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చిందని.. ముగ్గురు వైసీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి ఆఫర్ చేసిందని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇద్దరికి కేబినెట్ బెర్త్‌లు, ఒకరికి సహాయ మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 • Share this:
  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా షాకిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోసం శివసేన పార్టీ ఎన్డీయే నుంచి వెళ్లిపోగా.. వ్యవసాయ బిల్లులపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్‌లో పట్టు నిలుపుకునేందుకు కొత్త మిత్రులను వెతుకుతోంది బీజేపీ. అందులో భాగంగానే ఏపీలో బలంగా ఉన్న వైసీపీతో చేతులు కలిపేందుకు బీజేపీ సిద్ధమైందని తెలుస్తోంది. ఎన్డీయేలో వైసీపీ చేరబోతోందని ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతుండడంతో.. బీజేపీ పెద్దలతో విషయాన్ని చర్చించేందుకే వెళ్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  ఈసారి ప్రధాని మోదీతో వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారని ఏపీలో చర్చ జరుగుతోంది. మంగళవారం ప్రధానితో భేటీకి అపాయింట్‌మెంట్ కూడా ఖరారైనట్లు సమాచారం. ఐతే ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారనే తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, విభజన చట్టం హామీల అమలు సహా పలు అంశాలపై మాట్లాడేందుకు జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఐతే వీటితో పాటు మరో బలమైన కారణం కూడా ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీయేలో చేరికపై చర్చించేందుకే ప్రధాని మోదీతో జగన్ భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

  ఎన్డీయేలో చేరికకు సంబంధించి వైసీీపీకి కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చిందని.. ముగ్గురు వైసీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి ఆఫర్ చేసిందని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇద్దరికి కేబినెట్ బెర్త్‌లు, ఒకరికి సహాయ మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కడ ఖాయమని సమాచారం. అంతేకాదు ఏపీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజుకు.. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. ఐతే ఏపీలో ఇప్పటికే జనసేన పార్టీ మిత్రపక్షంగా ఉంది. ఒక్క సీటు కూడా లేని జనసేనతో కలిసున్నా? లేకపోయినా? ప్రయోజనం లేదన్న భావనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

  లోక్‌సభలో వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలముంది. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎన్ని రాజ్యసభ పదవులు వచ్చినా అవి వైసీపీ ఖాతాలోకే వెళ్తాయి. అందుకే ఉభయ సభల్లో బలంగా ఉన్న వైసీపీకి దగ్గరైతే ఎన్డీయేకు పూర్వ వైభవం వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీతో దోస్తీకి ముందుకొచ్చినట్లు సమాచారం. దానికి వైఎస్ జగన్‌ కూడా ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోల‌వ‌రం ప్రాజెక్టు, మండ‌లి ర‌ద్దు, జీఎస్టీ బ‌కాయిలు, విభజన హామీల అమలు గురించి చర్చించేందుకే ఢిల్లీకి వెళ్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రానికి మద్దతిస్తామని ఆనాడే చెప్పామని.. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్డీయేలో చేరాలంటూ తమకు బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆయన స్పష్టం చేశారు.


  వైసీపీతో బీజేపీ పొత్తుపై గతంలోనూ వార్తలు వచ్చాయి. త్వరలోనే వైసీపీ ఎన్డీయేలో చేరుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై అప్పట్లోనే స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలుచేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను నమ్మడం లేదని.. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో జనసేన ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటన సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేశారు పవన్. మొత్తానికి ఎన్డీయేలో వైసీపీ చేరుతుందన్న ప్రచారం ఇటు రాష్ట్ర రాజకీయాలు, అటు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ప్రధాని మోదీతో వైఎస్ జగన్ భేటీ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు