news18-telugu
Updated: December 6, 2019, 12:16 AM IST
ఏపీ సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఊహించని ఎత్తు వేసినట్టు కనిపిస్తోంది. కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఈరోజు సీఎంజగన్ ఢిల్లీకి వెళ్లారు. ఈనెల 23 లేదా 24న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని జగన్ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. తొలుత ఈనెల 26న ముహూర్తం ఫిక్స్ చేసినా.. ఆ రోజు అమావాస్య, సూర్యగ్రహణం కావడంతో కొంచెం ముందుకు జరిపింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీని పిలవడానికి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని మోదీని కలవనున్నట్టు సమాచారం. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం సాయం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అమలు చేయాల్సిన హామీల మీద ప్రధానంగా చర్చించనున్నారు. అయితే, ఈ సందర్భంగా ఎన్డీయేలోకి వైసీపీ చేరే అంశం మీద కూడా వారు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అమిత్ షాతో వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన బీజేపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు కొన్ని రోజుల క్రితం ఓ ఆర్ఎస్ఎస్ నేతతో చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రెండు విపక్ష పార్టీలు అధికార వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నరంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. జగన్ బీజేపీ వైపు వెళ్లకుండా చూసేందుకే ఈ విమర్శల దాడి పెంచినట్టు భావిస్తున్నారు. అయితే, బీజేపీ మాత్రం కొంచెం ఆచితూచి స్పందిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మాత్రం అప్పుడప్పుడు జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
తాము ఏం చేసినా దానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని గతంలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాజాగా పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లడం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. శివసేన ఎన్డీయే నుంచి వైదొలగడంతో ఆ ప్లేస్ భర్తీ చేయడానికి వైసీపీ పూనుకొన్నట్టు సమాచారం.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 5, 2019, 10:31 PM IST