అసెంబ్లీలో ఇబ్బంది పడుతున్న వైసీపీ... టీడీపీ ప్రశ్నలకు కప్పదాట్లు

సభలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నా విపక్ష వాదనను సరైన రీతిలో తిప్పికొట్టడంలో మాత్రం సమర్ధత కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

news18-telugu
Updated: July 17, 2019, 9:28 AM IST
అసెంబ్లీలో ఇబ్బంది పడుతున్న వైసీపీ... టీడీపీ ప్రశ్నలకు కప్పదాట్లు
చంద్రబాబు, రోజా
  • Share this:
ఏకపక్షంగా సాగుతాయని భావించిన ఏపీ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగుతన్నాయి. సభలో కేవలం 23 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నా... సున్నా వడ్డీ రుణాలు, కాపు రిజర్వేషన్లు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి విపక్ష టీడీపీ గట్టిగానే ప్రయత్నించింది. దీంతో విపక్షం సభలో తమకున్న బలంతోనే నెట్టుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. కీలక అంశాలపై చర్చ సందర్భంగా మంత్రులు గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నారనే అసంతృప్తి సీఎం జగన్ లో కూడా కనిపిస్తోంది.
ఏపీ శాసనసభ సమావేశాల్లో చర్చల సందర్భంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా కీలక అంశాలపై చర్చల సందర్భంగా అధికార వైసీపీ వ్యవహరిస్తున్న తీరు విపక్ష టీడీపీకి కలిసివస్తోంది. తమ దగ్గర అంకెలు ఏమున్నాయో చూసుకోకుండానే మీరు సున్నావడ్డీ రుణాలు ఇవ్వనేలేదంటూ టీడీపీని ఉద్దేశించి వాదించిన సీఎం జగన్... రెండోరోజు సభలో ఐదుశాతం రుణాలు ఇస్తే సరిపోతుందా అంటూ గొంతు సవరించుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల నుంచి ఆయనకు గట్టిగా మద్దతు లభించలేదు. ఓ దశలో విపక్ష నేత చంద్రబాబు నాయుడు సభలో అవాస్తవ సమాచారం ఇచ్చారంటూ సీఎంపై సభాహక్కుల తీర్మానం వరకూ వెళ్లారు. స్పీకర్ దాన్ని ఆమోదించకపోయినా సభలో అధికార పక్షం సున్నావడ్డీ రుణాలపై చర్చలో అనవసర పంతానికి వెళ్లి తేలిపోయిందనే వాదన వినిపించింది.
ఇదే కోవలో నిన్నటి కాపు రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా కూడా విపక్ష టీడీపీని టార్గెట్ చేసేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఐదేళ్లలో కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం గిల్లిగజ్జాలను మాత్రమే ఎండగట్టగలిగిన జగన్ సర్కారు... వచ్చే ఐదేళ్లలో తామేం చేయబోతున్నామో చెప్పలేకపోయింది. కేవలం నిధుల కేటాయింపుల ప్రస్తావనతో రిజర్వేషన్ల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు మేం ఇవ్వలేకపోయాం సరే.. మీరేం చేస్తారంటూ చంద్రబాబు వేసిన ప్రశ్నకు సీఎం జగన్ వద్ద నేరుగా సమాధానం లేకుండా పోయింది. దీంతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని రాబోయే రోజుల్లో మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నించే అవకాశముంది.

అన్నింటికంటే మించి కీలక అంశాలపై చర్చలకు మంత్రులు తగినంత స్ధాయిలో సిద్ధమై రావడం లేదనే విషయం అర్దమవుతూనే ఉంది. కొందరు మంత్రులైతే సభకు హాజరవడమే ఎక్కువ అన్నట్లుగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై సీఎం జగన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపై మంత్రుల హాజరీపై ఏరోజుకారోజు వివరాలు ఇవ్వాలని ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి సైతం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. సభలో వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నా విపక్ష వాదనను సరైన రీతిలో తిప్పికొట్టడంలో మాత్రం సమర్ధత కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.

అదే సమయంలో సభలో తక్కువ సంఖ్యాబలం ఉన్నా.. కీలక అంశాలపై విపక్ష టీడీపీ లేవనెత్తుతున్న సూటి ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం ఉండటం లేదు. కీలక అంశాలపై తగినంత హోమ్ వర్క్ చేయకపోవడమే దీనికి కారణమనేది నిర్వివాదాంశం. ఇకనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు తగిన స్ధాయిలో ప్రిపేర్ కాకుండా సభకు వస్తే వైసీపీకి మరింత ఇబ్బందులు తప్పకపోవచ్చు.(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 , సీనియర్ కరస్పాండెంట్)
First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు