ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ పేరుంది. ఇచ్చిన మాట తప్పడు అని. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు పార్టీ నేతలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేరుస్తారన్న పేరుంది. కానీ ఓ నేత విషయంలో మాత్రం సీఎం జగన్ తన హామీని నిలబెట్టుకోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు కారణం త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనంతరం ఆ పార్టీలో పదవులు ఆశించిన వారంతా నిరాశలో కూరుకుపోయారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత ముర్రిరాజశేఖర్ తీవ్రనిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిలకలూరిపేటలో ప్రచారం నిర్వహించిన వైఎస్ జగన్ మర్రి రాజశేఖర్ త్యాగం ఉరికేపోదని ఎమ్మెల్సీని చేసి మంత్రి మండలిలో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
2019 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట సీటును ఆశించారు. ఐతే అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలువరించాలంటే సౌమ్యుడు, మృదుస్వభావి అయిన మర్రి రాజశేఖర్ సరిపోరని.. ఈ విషయంలో ఆర్ధికంగా పటిష్టంగా ఉన్న విడదల రజనీ ఐతే మంచిదనే భావనతో జగన్ ఆమె వైపు మొగ్గుచూపారు. అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మర్రి రాజశేఖర్ కి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ అప్పటి నుండి మూడు సార్లు మండలిలో ఖాళీలు ఏర్పడినప్పటికీ మర్రికి మొండిచేయి చూపిస్తూ వచ్చారు. ఐతే ఈసారి ఏకంగా ఆరు స్థానాలు ఖాళీ అవడంతో జగన్ తనకు అవకాశం కల్పిస్తారని భావించారు. అలాగే మంత్రివర్గంలో కూడా చోటు దక్కుతుందని భావించారు.
ఐతే వైసీపీ ప్రకటించిన జాబితాలో మర్రి రాజశేఖర్ పేరు లేదు. వైసీపీ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్, అనంతపురం జిల్లా నుంచి మహ్మద్ ఇక్బాల్, చిత్తూరు జిల్లా నుంచి కల్యాణ చక్రవర్తి, విజయవాడ నుంచి కరీమున్నీసా, కడప జిల్లా నుంచి సీ.రామచంద్రయ్య, కర్నూలు జిల్లా నుంచి చల్లా భగీరథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. లిస్టులో మర్రి రాజశేఖర్ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు, స్థానిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆమె అడ్డుకుంటున్నారా..?
ఐతే మర్రికి పదవి రాకుండా ఎమ్మెల్యే విడదల రజని అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్న విడదల రజని.. సీఎంఓలోని ఓ ముఖ్యనేత ద్వారా మర్రి రాజశేఖర్ ను అడ్డుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. మర్రికి ఎమ్మెల్సీ పదవి వస్తే.. మంత్రి పదవి రేసులో తాను వెనుకబడతానని రజనీ భావిస్తున్నట్లు మర్రి రాజశేఖర్ వర్గం ఆరోపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap mlc elections, AP Politics, Guntur, Vidadala Rajani, Ysrcp