ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly) జరిగిన ఘటనలు, చంద్రబాబు (Nara Chanra Babu Naidu) ఆరోపణలు, ఎన్టీఆర్ కుటుంబం (NTR Family) ప్రెస్ మీట్ పై దివంగత ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. గతంలో ఎన్టీఆర్ ను మోసం చేసినట్లు ఇప్పుడు చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎప్పటిమాదిరిగానే చంద్రబాబు కుటుంబానికి అబద్ధంచెప్పారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా జరిగినట్లు క్రియేట్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకొని పెద్ద డ్రామా సృష్టించారని మండిపడ్డ లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ విషయంలో ఒక్క నిజం కూడా చెప్పని చంద్రబాబు... అప్పట్లో భువనేశ్వరి, పురందేశ్వరి, బాలకృష్ణ(Nandamuri Bala Krishna), ఇతర కుటుంబ సభ్యుల మనసు మార్చారని ఆరోపించారు. ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో బాలకృష్ణకు ఎంత చెప్పినా వినలేదని.. ఇప్పుడు మరోసారి ఆయన చంద్రబాబు ట్రాప్ లో పడ్డారన్నారు. అలాగే ఎన్టీఆర్ చనిపోయినప్పుడు చంద్రబాబు ఫోన్ చేసి ఎంతడబ్బు కావాలో చెప్పాలని ఆఫర్ ఇచ్చారని గుర్తుచేశారు. బాలకృష్ణ అమాయకుడని.. అలాంటి బాలయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్ధం కావడం లేదన్నారు.
వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ కు చంద్రబాబే కర్త కర్మ క్రియ అని.. అప్పుడు బాలకృష్ణకు చంద్రబాబు కుట్రను వివరించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆడుతున్న నాటకాన్ని గుర్తించి నందమూరి కుటుంబం కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబుకు చనిపోయేవరకు అధికారం కావాలని అందుకే ఇప్పుడు భువనేశ్వరిని వివాదంలోకి లాగి లబ్ధిపొందాలని కుట్ర చేస్తున్నారని లక్ష్మిపార్వతి ఆరోపించారు.
ఇక చంద్రబాబు గురించి అన్నీ తెలిసిన పురందేశ్వరి కూడా ఆయన మాటలను ఎందుకు నమ్ముతున్నారో అర్ధం కావడం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసి మోసం చేసిన సంగతి మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే మీరు పార్టీని విడిచివెళ్లిన సంగతి గుర్తులేదా..? అని ఆమె అన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కామెంట్స్ పైనా లక్ష్మీపార్వతి స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన తల్లిని నందమూరి కుటుంబం ఎన్నిరకాలుగా అవమానించిందో తెలియదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు పదేళ్ల వయసున్నప్పుడు నందమూరి కుటుంబంలోని పిల్లలతో కూడా కలిసి ఆడుకోనివ్వలేదన్నారు. ఇప్పుడు స్టార్ హీరో కావడం, మంచి పేరు రావడంతో ఎన్టీఆర్ ను దగ్గరకు రానిచ్చారని.. పిల్లని ఇవ్వడానికి కూడా వెంటపడ్డారని ఆమె అన్నారు. అప్పట్లో జరిగిన అవమానాలను మీ అమ్మని అడిగితే చెబుతారని లక్ష్మీపార్వతి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bala Krishna Nandamuri, Lakshmi Parvathi, NTR, TDP, Ysrcp