YS Jagan Dussehra Gift: వైసీపీ బీసీ నేతలకు సీఎం జగన్ దసరా ‘బోనస్’

56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను అక్టోబర్ 18న ప్రభుత్వం ప్రకటించనుంది.

news18-telugu
Updated: October 16, 2020, 2:26 PM IST
YS Jagan Dussehra Gift: వైసీపీ బీసీ నేతలకు సీఎం జగన్ దసరా ‘బోనస్’
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా గిఫ్ట్ అందివ్వనున్నట్టు తెలిసింది. తాను అధికారంలోకి వస్తే ఒక్కో బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలో భాగంగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కనీసం ఒక్కో బీసీ కులంలో 30వేలకు మందికి పైగా ఉంటే ఆ కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నామినేటెడ్ తరహాలో భర్తీ చేయనున్నారు. వైసీపీలో ఆయా సామాజికవర్గాలకు చెందిన బీసీ నేతలకు పదవులు లభించనున్నాయి. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను అక్టోబర్ 18న ప్రకటించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో మంత్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, నేతలకు ఇచ్చిన హామీలను కూడా బేరీజు వేసుకుని ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించనున్నారు. అలాగే, ఆయా బీసీ కార్పొరేషన్లలోని డైరెక్టర్ పదవుల్లో 50 శాతం మహిళలకు దక్కనున్నాయి. 56 చైర్మన్ పదవుల్లో 29 పదవులు మహిళలకు దక్కుతాయి. 27 మంది పురుషులకు చైర్మన్ పదవులు లభించనున్నాయి. ఈ పదవుల్లో అన్ని జిల్లాల వారికి ప్రాధాన్యం ఉండేలా జాబితాను సిద్దం చేశారు.

ఈ బీసీ కులాలకు చైర్మన్ల ప్రకటన

రజక, కురుమ, తొగట, కుంచిటి వక్కళిగ, వన్యకులక్షత్రియ, పాల ఎకరి, ముదలియార్, ఈడిగ, గాండ్ల, పెరిక, అగ్నికుల క్షత్రియ, షేక్, వడ్డెర, కుమ్మరి శాలివాహన, కృష్ణ బలిజ, యాదవ, నాయీ బ్రాహ్మణ, పద్మశాలి, దూదేకుల, విశ్వబ్రాహ్మణ, సగర, గౌడ, వడ్డెలు, భట్రాజ, వాల్మీకి, కరికాల భక్తులు, వీరశైవ, లింగాయత్, జంగం, బెస్త, ముదిరాజ్, బండిలి, ముస్లిం సంచార జాతులు, చెత్తదశ్రీవైష్ణవ, ఆరె కటిక, దేవాంగ, మేదర, కళింగ, కళింగ కోమటి, రెడ్డిక, పొలినాటి వెలమ, కూరాకుల, శ్రీశయన, మత్స్యకార, గవర, నగరాలు, యాట, నాగవంశం, తూర్పుకాపు, కొప్పుల వెలమ, శిష్టకరణం, దాసరి, సూర్య బలిజ, శెట్టి బలిజ, స్థిరస, ఇతర అత్యంత వెనుకబడిన కులాలకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించనుంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఏడుగురు బీసీ మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. అలాగే, వైసీపీ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. 16 నెలల కాలంలో జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, ఇతర సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు రూ.33,500 కోట్లు ఖర్చు చేసింది.

ఏపీలో టీడీపీకి చెందిన బీసీ నేతలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని చంద్రబాబునాయుడు పలుమార్లు ప్రకటించారు. అయితే, అలాంటి బీసీలను వైసీపీ వైపునకు మళ్లించేందుకు జగన్ వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారు. బీసీలకు కార్పొరేషన్లు ప్రకటించడం కూడా అందులో భాగమేనని చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 16, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading