పురుషులు మహిళల్ని మోసం చేయడం చూశాం, ప్రభుత్వమే మోసం చేయడం చూస్తున్నాం: అనిత

ఇళ్ళు కట్టకుండానే గృహ ప్రవేశానికి ఆహ్వానించినట్లు, దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించకుండానే వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లు దిశ చట్టం పేరుతో ప్రచారం చేసుకుంటోందని అనిత ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: October 16, 2020, 5:47 PM IST
పురుషులు మహిళల్ని మోసం చేయడం చూశాం, ప్రభుత్వమే మోసం చేయడం చూస్తున్నాం: అనిత
వంగలపూడి అనిత, టీడీపీ మహిళా అధ్యక్షురాలు
  • Share this:
ఇళ్ళు కట్టకుండానే గృహ ప్రవేశానికి ఆహ్వానించినట్లు, దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదించకుండానే వైసీపీ ప్రభుత్వం ఇన్నాళ్లు దిశ చట్టం పేరుతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన దిశ బిల్లులో చాలా లోపాలున్నాయని చూపిస్తూ.. కేంద్రం వెనక్కి పంపిందని ఆమె గుర్తు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి నోరు మెదపరా అని ఆమె ప్రశ్నించారు. లోపాలతో బిల్లులు చేసి ఆమోదించపోతే తప్పు కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారా అని నిలదీశారు. దిశ చట్టం ఆమోదం పొందకుండానే ఇన్నాళ్లూ మహిళలపై జరిగిన అఘాయిత్యాలలో నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేశామని ఎలా చెప్పారని అనిత ప్రశ్నించారు. ‘బిల్లు ఆమోదం పొందకుండానే రాజమండ్రిలో ఆర్భాటంగా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం మీ ప్రచార ఆర్భాటానికి నిదర్శనం కాదా? ప్రచారంపై చూపిస్తున్న శ్రద్ధ.. మహిళల భద్రతపై ఎందుకు చూపడం లేదు? ఇన్నాళ్లు పురుషులు మహిళల్ని మోసం చేయడం చూశాం. ఇప్పుడు ప్రభుత్వమే మహిళల్ని మోసం చేయడం చూస్తున్నాం.’ అని వంగలపూడి అనిత విమర్శించారు.

అత్యాచారాలకు గురైన మహిళలను కూడా ప్రభుత్వం మోసం చేస్తోందని అనిత మండిపడ్డారు. ‘మీ ప్రచారం కోసం అత్యాచారాలకు గురైన మహిళల్ని కూడా మోసం చేయడం సిగ్గుమాలిన చర్య. వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వైఖరి వల్లే రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలో ఉన్న విజయవాడ నడిబొడ్డున వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువతులు ఉన్మాదుల చేతిలో బలయ్యారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో చోట మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళా హోమ్ మంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగటం బాధాకరం. మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీలోని మహిళా ఎమ్మెల్యేలు, నేతలు ఎందుకు స్పదించటంలేదు? దిశ చట్టం గురించి అసెంబ్లీలో గొంతు చించుకుని గొప్పలు చెప్పిన రోజా.. ఇప్పుడేందుకు నోరు మెడపటం లేదు? వైసీపీ ప్రభుత్వం ఇకనైనా మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి.’ అని అనిత డిమాండ్ చేశారు.

విజయవాడలో దివ్య తేజస్విని ప్రేమ పేరుతో హత్య చేశాడు నాగేంద్ర అలియాస్ చిన్నస్వామి. ఆమె ఇంట్లోనే దారుణంగా కత్తితో పొడిచాడు. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకున్నాడు. అయితే, దివ్యతో తనకు పెళ్లి జరిగినట్లు నిందితుడు నాగేంద్ర అలియాస్‌ చిన్నస్వామి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. మంగళగిరిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఆమె తండ్రి వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ఆరోపించాడు. అయితే, ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఘోరమని, ఇటువంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ప్రేమించకపోతే మరణ శాసనం రాస్తారా.. చంపేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. కేంద్రం కూడా దిశ లాంటి చట్టానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. మనోవర్తి కేసులపై కూడా న్యాయవ్యవస్థ ఆలోచన చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. శిక్షలు పడేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 16, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading