news18-telugu
Updated: August 28, 2019, 12:54 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం సుముఖంగా లేనట్టు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో సానుకూలంగా లేదని... ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు బట్టి ఈ విషయం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని గతంలో తాము కూడా ఆరోపించిన విషయం వాస్తవమే అని ఆయన అన్నారు. అయితే రాజధాని విషయంలో రాష్ట్రంలో నెలకొన్న డైలమాను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
దీనిపై సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించాలని జీవీఎల్ నరసింహారావు ఏపీ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని అన్నది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో అవినీతి జరిగినట్టు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే చర్యలు తీసుకొవచ్చని అన్నారు. రాజధానికి 5 వేల ఎకరాలు సరిపోతామని... అవసరానికి మించి భూములను సేకరించారని ఎంపీ జీవీఎల్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌కు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా డబ్బు చెల్లించిందని రాష్ట్ర ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీలో తేలినట్టు జీవీఎల్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని మరోసారి స్పష్టం చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
August 28, 2019, 12:35 PM IST