రఘురామకృష్ణంరాజుకు షాక్ ఇచ్చిన సీఎం జగన్... వారం రోజుల్లో...

వైఎస్ జగన్, రఘురామ కృష్ణంరాజు (ఫైల్ ఫోటో)

Raghuramakrishnam Raju | తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి పెద్ద దుమారానికి తెరలేపారు.

  • Share this:
    నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఇటీవల వరుసగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయనకు పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీస్ జారీ చేశారు. గత పది రోజులుగా పార్టీ అధినాయకత్వం మీద, వైసీపీ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని సూచించారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని రఘురామకృష్ణంరాజును అందులో ఆదేశించారు. రఘురామకృష్ణంరాజు, వైసీపీ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం కొనసాగుతోంది. నియోజకవర్గ సమస్యల గురించి చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ రఘురామకృష్ణంరాజు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. మీడియా ముందు ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన మీద కూడా కొన్ని విమర్శలు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది పెద్ద దుమారం రేగింది.

    రఘురామకృష్ణంరాజు మీద పలువురు మంత్రులు, వైసీపీ నేతలు మూకుమ్మడిగా విమర్శల దాడి చేశారు. మూడు పార్టీలు తిరిగిన రఘురామకృష్ణంరాజు జగన్ ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు అదే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న ఆయన దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దీనికి నర్సాపురం ఎంపీ కూడా ఘాటుగానే బదులిచ్చారు. తాను జగన్ ఫొటో పెట్టుకుని గెలవలేదని, తన ఫొటో పెట్టుకునే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, వారంతా రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమైతే తాను కూడా రెడీ అంటూ ఘాటుగా స్పందించారు.

    కొన్ని రోజుల క్రితం వైసీపీ కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసన తెలిపారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ వ్యవహారం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
    First published: