ఏపీలో ఈసారి వైసీపీ ప్రభంజనంలో టీడీపీ నాలుగు జిల్లాల్లో పూర్తిగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఇందులో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. వీటిలో టీడీపీ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడం నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. భవిష్యత్తులో ఆయా జిల్లాల్లో వైసీపీ పూర్తిగా పట్టు సాధించేందుకు ఈ సమీకరణం ఉపయోగపడనుంది.
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈసారి టీడీపీకి శరాఘాతంగా మారబోతున్నాయి. ఘోర పరాజయం ఓ ఎత్తయితే, పలు జిల్లాల్లో ప్రాతినిధ్యం కోల్పోవడం టీడీపీ మూలాలకు కూడా నష్టం చేయనుంది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, అవినీతి, ఎమ్మెల్యేల తీరు, ప్రభుత్వ విధానాలు అన్నీ కలిసి టీడీపీకి కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేసేశాయి. వీటిలో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలు గ్రేటర్ రాయలసీమగా పిలిచే ప్రాంతంలో భాగంగా ఉన్నవే. వాస్తవానికి టీడీపీ అటు చిత్తూరు నుంచి నెల్లూరు వరకూ ఉన్న 61 అసెంబ్లీ సీట్లలో కేవలం మూడు సీట్లు మాత్రమే గెల్చుకుందంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
కడప బోర్డు
కడప జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లను వైసీపీ గెల్చుకోవడాన్ని బట్టి చూస్తే జగన్ ప్రభంజనం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతుంది. సహజంగానే వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో వైసీపీ అత్యధిక సీట్లు గెల్చుకుంటుందని అంతా భావించారు. టీడీపీ కనీసం జమ్మలమడుగు, రాజంపేట స్ధానాల్లో ప్రభావం చూపుతుందని కొందరు అంచనా వేశారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య విభేధాలు సమసిపోవడం, వీరిద్దరు పరస్పర అంగీకారంతో బరిలోకి దిగడం బట్టి చూస్తే జమ్మలమడుగులో పరిస్ధితి ఈసారి టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చని భావించారు. కానీ దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య సాగిన యుద్దం బాధితులుగా మిగిలిన వారు మరోలా భావించారు. మీరూ మీరూ కలిసిపోతే మా పరిస్ధితి ఏంటని ఆలోచించారు. దాని ఫలితమే జమ్మలమడుగులో టీడీపీ పరాజయం. అలాగే రాజంపేటలో మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో తమకు పరిస్దితి అనుకూలంగా మారిందని టీడీపీ సంబరపడింది. ఆ సంతోషం కూడా ఎంతోకాలం నిలవలేదు. మొత్తంగా కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా మరోసారి నిరూపితమైంది.
కర్నూలు కొండారెడ్డి బురుజు (File)
కర్నూలు జిల్లాలో గతంలోనూ వైసీపీ మెజారిటీ సీట్లు సాధించింది. వైసీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిపోయారు. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి కోట్ల కుటుబం, పాణ్యంలో గౌరు వెంకటరెడ్డి కుటుంబం టీడీపీలో చేరింది. దీంతో ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలని టీడీపీ ఆశపడింది. అయితే జిల్లాలో ఇంతకాలం ప్రత్యర్ధులుగా ఉన్న కోట్ల కుటుంబానికి కేఈ కుటుంబానికి మధ్య చంద్రబాబు సయోధ్య కుదిర్చినా ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. దాని ఫలితమే ఇరు కుటుంబాల అభ్యర్ధులు దారుణంగా ఓడిపోయారు. అలాగే వైసీపీని మోసం చేసి టీడీపీలోకి వెళ్లేందుకు ముందుగా ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు గౌరు వెంకటరెడ్డి కుటుంబాన్ని దెబ్బతీశాయి. దీంతో పాణ్యంలో చరితారెడ్డి ఓటమి పాలయ్యారు. కాటసాని కుటుంబం కూడా వైసీపీకి పూర్తిగా అండగా నిలవడంతో కర్నూలు క్లీన్ స్వీప్ అయింది.
బొత్స సత్యనారాయణ (File)
సహజంగానే రెడ్ల ప్రభావం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఈసారి వైసీపీ గెలుపు కోసం జిల్లాలోని ప్రభావం చూపగల రెడ్డి కుటుంబాలన్నీ ఎన్నికలకు ముందే వైసీపీవైపు చేరిపోయాయి. వీరిలో నల్లపురెడ్డి, మేకపాటి కుటుంబాలు అప్పటికే వైసీపీలో ఉండగా.. నేదురుమల్లి, ఆదాల, ఆనం కుటుంబాలు ఎన్నికలకు ముందు వైసీపీకి వచ్చాయి. దశాబ్దాలుగా ప్రత్యర్ధుల్లా ఉన్న జిల్లాలోని రెడ్డి కుటుంబాలన్నీ వైసీపీ వైపు రావడం గత 70 ఏళ్లలో ఇదే తొలిసారని ఎన్నికల సందర్భంగా స్ధానికులు న్యూస్ 18కు చెప్పారు. ఈ సమీకరణం టీడీపీని దారుణంగా దెబ్బతీసింది. చివరికి టీడీపీ ఆశలు పెట్టుకున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనూ మంత్రి నారాయణ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నే జనం గెలిపించారు. దీంతో ఈ జిల్లా కూడా వైసీపీ ఖాతాలోకి క్లీన్ స్వీప్ అయింది.
పాదయాత్రలో జగన్ (ఫైల్ ఫొటో)
ఇక ఎన్నడూ లేని స్ధాయిలో విజయనగరం జిల్లాలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగడం రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపరిచింది. సాధారణంగా టీడీపీకి అండగా ఉండే ఉత్తరాంద్ర జిల్లాల్లో ఒకటైన విజయనగరంలో ఈసారి బొత్స కుటుంబం హవా అప్రతిహతంగా కొనసాగింది. ఆయన కుటుంబం నుంచి ఇద్దరు, ఆయనకు వరుసకు మేనల్లుడైన బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా గెలుపొందారు. దీంతో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్న స్ధాయిలో బొత్స కుటుంబానికి జిల్లాలో ఆదరణ దక్కిందని చెప్పవచ్చు. బొత్స హవాలో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన బొబ్బిలి రాజు మంత్రి సుజయకృష్ణ రంగారావు, జిల్లాలోనే అత్యంత నిజాయితీపరుడు, పెద్దమనిషిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సైతం ఓటమిపాలవ్వడం విశేషంగా చెప్పవచ్చు. జిల్లాలో నెల్లిమర్ల నుంచి గతంలో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణస్వామి నాయుడు వంటి దిగ్గజాలు సైతం వైసీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. దీంతో వైసీపీ ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.