కేంద్రంలో జగన్ ఎటువైపు... వైసీపీలో ఆసక్తికర చర్చ

భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం అందాల్సి ఉందనే భావనలో ఉన్న జగన్... కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారితోనే కలిసి చేయాలని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

news18-telugu
Updated: May 17, 2019, 11:47 AM IST
కేంద్రంలో జగన్ ఎటువైపు... వైసీపీలో ఆసక్తికర చర్చ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ఎన్నికల్లో అధికారంలో తమదే అనే ధీమాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూర్తి మెజార్టీ తమకు వస్తుందని బలంగానే నమ్ముతున్నారు. ఈ కారణంగానే ఆయన తన పార్టీ కార్యాలయాన్ని అమరావతికి మార్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం తమదే అని భావిస్తున్న జగన్... కేంద్రంలో హంగ్ వస్తే తమ పార్టీ మద్దతు కీలకమవుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో తమ పార్టీకి దాదాపు 20 లోక్ సభ సీట్లు వస్తాయని భావిస్తున్న వైసీపీ... కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తుందనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు.

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నాలు చేయడంతో పాటు ఇందుకోసం అనేక పార్టీల మద్దతు కూడా కూడగడుతున్నారు. కానీ జగన్ మాత్రం కేంద్రంలో తాము ఎటు వైపు అనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం కేంద్రంలో తమ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడబోయే మే 23న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి టీఆర్ఎస్, వైసీపీ సహా పలు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి టీఆర్ఎస్, వైసీపీలు వెళతాయా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఫలితాలు వచ్చిన రోజే కాంగ్రెస్ సారథ్యంలోని సమావేశానికి హాజరుకావడం ఎందుకునే భావనలో టీఆర్ఎస్, వైసీపీలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలని దానిపై వేచిచూసే ధోరణి అవలంభించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎస్ జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం అందాల్సి ఉందనే భావనలో ఉన్న జగన్... కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారితోనే కలిసి చేయాలని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే కాంగ్రెస్, బీజేపీల్లో ముందుగానే ఒకరికి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదని వైసీపీ అధినేత నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి మే 23న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేయబోయే సమావేశానికి వైసీపీ హాజరుకాకపోయినా... ఆ పార్టీ కాంగ్రెస్ కూటమికి పూర్తిగా దూరమైనట్టే అని భావించాల్సిన పనిలేదని అర్థమవుతోంది.
First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>