• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YSR CONGRESS PARTY GOT EDGE IN UNANIMOUS ELECTIONS IN ANDHRA PRADESH MUNICIPAL POLLS FULL DETAILS HERE PRN

AP Municipal Elections: పురపోరులోనూ వైసీపీదే హవా... ఏకగ్రీవాల్లో జోరు.. జిల్లాల వారీ రిపోర్ట్ ఇదే

AP Municipal Elections: పురపోరులోనూ వైసీపీదే హవా... ఏకగ్రీవాల్లో జోరు.. జిల్లాల వారీ రిపోర్ట్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

AP Municipal Elections: పంచాయతీ ఎన్నికల (AP panchayat Elections) మాదిరిగానే మున్సిపాలిటీల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ హవా చాటుతోంది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 7,263 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈనెల 10న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏకగ్రీవాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏకగ్రీవాల్లో దాదాపు 80శాతానికి పైగా వైసీపీ ఖాతాలో చేరాయి. రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు,కడప, కర్నూలు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదయ్యాయి.

    ఇప్పటివరకు నమోదైన ఏకగ్రీవాలను పరిశీలిస్తే... చిత్తూరు కార్పొరేషన్‌ పరిధలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకంది. జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

    ఇది చదవండి: ఏపీలో ఆ మంత్రి జాడెక్క‌డ..? ఆయన మౌనం వెనుక కార‌ణాలేంటి..?



    సీఎం సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ తన మార్క్ చూపించింది. పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34కు 34 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 13 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    కడప కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూల్ జిల్లాలోని డోన్ మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకుగానూ 22 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరధిలోని 24 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు కార్పొరేషన్‌లోని 34, 35 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులకు గాను 12, ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలోని 27 వార్డులకు గాను 8, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, ఆదోని మున్సిపాలిటీలో 9, నందికొట్కూరు మున్సిపాలిటీలోని 29 వార్డులకు గాను 4 వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    అనంతపురం జిల్లాలోని గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డులు, ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డులు, గుంతకల్లు మున్సిపాలిటీలోని 3 వార్డులు, తాడిపత్రిలో 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

    ప్రకాశం జిల్లాలో మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల మున్సిపాలిటీలోని 33 వార్డులకు గాను 3, గిద్దలూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు 7, మార్కాపురం మున్సిపాలిటీలోని 35 వార్డులకుగాను 5 వార్డులు, కనిగిరి నగర పంచాయతీలోని 20 వార్డులకు గాను 7 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 25 వార్డులకు గాను 13 వార్డుల్లో, ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 6 వార్డులు, నాయుడుపేట మున్సిపాలిటీలోని 25కి గాను 21 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    గుంటూరు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మాచర్ల మున్సిపాలిటీలోని మొత్తం 31 వార్డుల్లో, పిడుగురాళ్లలోని మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినుకొండ మున్సిపాలిటిలో 7, రేపల్లె మున్సిపాలిటీలో 4, సత్తెనపల్లిలో 2, తెనాలిలో 2, గుంటూరు కార్పొరేషన్‌లో 1 డివిజన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.

    కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డులు, తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డులు, నూజివీడు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను 2 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌లో 3 డివిజన్లు, కొవ్వూరు మున్సిపాలిటీలో 9 వార్డులు, నర్సాపురం మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

    తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, తుని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. రామచంద్రాపురం మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులు, తుని మున్సిపాలిటీలోని 30 వార్డులకుగాను 15 వార్డులు, అమలాపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6, పిఠాపురంలో 6, సామర్లకోటలో 28 వార్డుల్లో 2, ముమ్మిడివరంలో 20 వార్డుల్లో 1 వార్డును వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

    విశాఖ జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 3 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 2 వార్డులు, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 31 వార్డులకు గాను 2 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డులకు గాను 6 వార్డులు, బొబ్బిలి మున్సిపాలిటీలో 1 వార్డులో వైఎస్సార్సీపీ ఏకగ్రీవమైంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు