AP Municipal Elections: బాలకృష్ణకు షాక్ తప్పదా... హిందూపురం ఫలితంపై టెన్షన్..

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ(ఫైల్)

గత ఎన్నికల్లో టీడీపీ (Telugu Desham party) 19, వైసీపీ (YSR Congress) 19 వార్డులు కైవసం చేసుకోగా.. ఎక్స్ అఫీషియో ఓట్లతో టీడీపీ ఛైర్మన్ స్థానాని దక్కించుకుంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో వైసీపీ హవా చూపిస్తోంది. చాలా చోట్ల ఫ్యాన్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు ప్రముఖులకు చెందిన మున్సిపాలిటీల్లోనూ వైసీపీ జోరు చూపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ ముఖ్యనేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతిథ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీకి, బాలయ్యకు షాక్ తప్పేలా లేదు. 38 వార్డులున్న హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీని గెలిపించేందుకు బాలయ్య విశ్వప్రయత్నాలు చేసినా.. రిజల్ట్ మాత్రం రివర్స్ లో వచ్చేలానే కనిపిస్తోంది. ప్రస్తుతం హిందూపురంలో వైసీపీ హవా కొనసాగుతోంది. 38 వార్డులకు గానూ 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే లెక్కింపు మొదలైన రెండు గంటల్లోనే 3 వార్డులను వైసీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు వార్డుల్లో ఆ పార్టీ లీడ్ లో ఉండగా టీడీపీ వెనుకబడిపోయింది.

    గత ఎన్నికల్లో టీడీపీ 19, వైసీపీ 19 వార్డులు కైవసం చేసుకోగా.. ఎక్స్ అఫీషియో ఓట్లతో టీడీపీ ఛైర్మన్ స్థానాని దక్కించుకుంది. ఐతే ఈసారి ఎక్స్ అఫిషియో ఓట్లతో పనిలేకుండానే ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాతో ఉంది. మరోవైపు ఎన్నికల ముందు ఐదు రోజుల పాటు హిందూపురంలోనే మకాం వేసిన బాలకృష్ణ.. ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని షూటింగులను కూడా ఆయన వాయిదా వేసుకున్నారు. హిందూపురంలో వైసీపీకి చెక్ పెడతామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు వైసీపీ కూడా అంతే సీరియస్ గా తీసుకొని ప్రచారం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్యపై ఓటమిపాలైన మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైసీపీ అధిష్టానం.. ఆయనకు హిందూపురం మున్సిపాలిటీలో విజయాన్ని టార్గెట్ గా పెట్టింది. అందుకు తగ్గట్లుగానే బాలయ్యకు ధీటుగా ప్రచారం నిర్వహించారు. దీంతో అక్కడ ఫ్యాన్ గ్యాలి బలంగా వీస్తున్నట్లు తెలుస్తోంది.

    Latest Municipal Election Result Update news


    పంచాయతీ ఎన్నికల్లోనూ హిందూపురంలో వైసీపీ హవా కనిపించింది. అక్కడి రూరల్ ఓటర్లు బాలయ్యకు షాకిచ్చారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో అనంతపురం కార్పొరేషన్ తో పాటు తాడిపత్రి, ధర్మవరం,కదిరి, మడకశిర మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది.

    Latest Municipal Election Result Update news


    ఇప్పటికే సీమ జిల్లాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు,పుత్తూరు మున్సిపాలిటీలు, కడప జిల్లాలో కడప కార్పొరేషన్, పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో చేరాయి. అటు కర్నూలు జల్లాలో డోన్, ఆత్మకూరు, కర్నూలు కార్పొరేషన్ గెలుచుకునేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసింది.
    Published by:Purna Chandra
    First published: