ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanam) నూతన పాలక మండలిని (TTD Board) నియమించిన సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతలు, ఎమ్మెల్యేలకు టీటీడీలో స్థానం దక్కింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ట్రస్టు బోర్డు మెంబర్ చాలా మంది నేతల కల. కానీ ఆ పదవి తనకొద్దన్నారు ఓ ఎమ్మెల్యే. చాలా మంది నాయకులకి ఎంతో కష్టపడినా రాని ఆ పదవిని ఎందుకొద్దన్నారు..? టిటిడి మెంబర్ అవ్వటం అదృష్టంగా చాలా మంది భావిస్తారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం దాన్ని వద్దే వద్దు అన్నారు. ఇలా ఎందుకు అంటే చాలా కారణాలు చెబుతున్నారట. మంత్రి పదవి రాలేదని అందుకే తాను టిటిడి బోర్డు పదవి వద్దని చెప్పానని కూడా చెప్తున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరు ఫోన్ చేసినా ఎత్తటం లేదట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంటా కధ..!
విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు (MLA Golla Babu Rao) వైసీపీ అధిష్ఠానంపై అలకబూనారు. మంత్రి పదవి ఆశిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమించడంతో తీవ్ర అసంతృప్తి చెందారు. విషయం తెలిసిన ఎంపీ విజయసాయి రెడ్డి (MP VijayaSai Reddy) ఆయనకు ఫోన్ చేశారు. ‘నాకు టీటీడీ పదవి అవసరంలేదు’ అంటూ ఫోన్ కాల్ కట్ చేయడమే కాకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేరు కూడా వుంది. అయితే రెండేళ్ల కిందట టీటీడీ బోర్డును నియమించినప్పుడు సభ్యునిగా బాబూరావు పేరు వినిపించింది. ఏ కారణం చేతనోగానీ ఆయనకు బదులు ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును ఎంపిక చేశారు. అప్పట్లో నిరాశ చెందిన ఆయనకు ఈసారి అధిష్ఠానం అవకాశం కల్పించి టీటీడీ బోర్డుసభ్యుడిగా నియమించింది. కాగా సీఎంగా జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు... రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రులందరినీ మార్చుతానని ప్రకటించడం, త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వుంటుందని ఊహాగానాలు వెలువడుతుండడంతో గొల్ల బాబురావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించడం అంటే మంత్రి పదవి లేదని పరోక్షంగా చెప్పినట్టేనని భావించిన ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా బాబూరావుకు ఫోన్ చేశారు. ‘‘నాకు టీటీడీ పదవి అవసరం లేదు’’ అని ఫోన్ కట్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, జగన్ వెంట నడిచిన అతికొద్దిమందిలో తాను ఒకడినని, దళితుడిని కాబట్టే తనను చిన్నచూపు చూస్తున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. అప్పట్లో జగన్మోహన్‌రెడ్డిని తీవ్రదుర్భాషలాడిన వారికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవులు కట్టబెట్టారని, తనను మాత్రం పక్కన పెట్టారని వాపోయినట్టు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ttd, Ysrcp