వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. అతడి ఖాతాల్లో భారీగా డబ్బు

పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను విచారించారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

news18-telugu
Updated: September 24, 2020, 11:48 AM IST
వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. అతడి ఖాతాల్లో భారీగా డబ్బు
వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)
  • Share this:
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ అధికారులు.. బుధవారం కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.  నిన్నటి విచారణతో ఈ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను విచారించారు.  మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ. 20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు తేల్చారు సీబీఐ అధికారులు. అతడి ఖాతాల్లో అంత డబ్బు ఎక్కడిది? అనే దానిపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు.

గతంలో మున్నా ఫ్యామిలీ వివాదాల్లో వైఎస్ వివేకాందరెడ్డి కలగజేసుకున్నట్లు సమాచారం. భార్యాభర్తల వ్యవహారంలో మున్నాను అప్పట్లో ఆయన మందలించినట్లు తెలిసింది. మున్నా ముగ్గురిని వివాహం చేసుకోవడంతో.. వారి పంచాయతీ వైఎస్ వివేకా వద్దకు వచ్చిందని, ఆ క్రమంలో మున్నాను వైఎస్ వివేకా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మున్నా మొదటి భార్యను రెండు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించారు. అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న మున్నా ఇంటికి వెళ్లి.. అతడి తల్లి సమక్షంలో బ్యాంక్ లాకర్ తెరిచారు. లాకర్‌లో ఉన్న నగదు, ఇతర అభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక గురువారం కూడా పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. పులివెందులలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకొని డేటాను పరిశీలిస్తున్నారు. ఉదయ్ కుమార్ యురేనీయం కర్మాగారం పనిచేసే ఉదయ్‌ కుమార్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

కాగా, 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల ముందు హత్య జరగడంతో.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే నాటి టీడీపీ ప్రభుత్వం మాత్రం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది.

సిట్‌తో న్యాయం జరగడం లేదని.. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు గత రెండు నెలలుగా విచారిస్తున్నారు. రెండు రోజులుగా పులివెందులలో ఉండి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. ఐతే చెప్పుల వ్యాపారి మున్నాను సీబీఐ అధికారులు విచారించడం, ఆయన బ్యాంకు లాకర్ల భారీగా నగదును స్వాధీనం చేసుకోవడం.. ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: September 24, 2020, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading