YS Sharmila: ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా.. పాదయాత్రకు సిద్ధం అవుతున్న వైఎస్ షర్మిల..

image credit - twitter - YSRTP

YS Sharmila: వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన రోజే 100 రోజుల తర్వాత పాదయాత్ర చేపడతామని వైఎస్ షర్మిల తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ యాత్రకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అక్టోబర్ 18వ తేదీన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

  • Share this:
    రాజకీయాల్లో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసిన తర్వాత 2004లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ఆర్ తనయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిన తర్వాత 2019 ఎన్నికలో అత్యధిక స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చారు. ఈ నేతల కంటే ముందు కూడా ఎంతో మంది పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన ఘటనలు ఉన్నాయి. పాదయాత్ర చేసిన వారిలో విజయం సాధించిన వాళ్లే ఎక్కువ శాతం ఉన్నారు. అపజయం సాధించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే  ఈటల రాజేందర్ కూడా 19 జూలై నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో ఈటల పాదయాత్ర హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలం బత్తినవారిపల్లి నుంచి ప్రారంభించారు.

    తాజాగా.. రాష్ట్రంలో పార్టీని ప్రకటించిన షర్మిల కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2021, జూలై 08వ తేదీన వైఎస్సార్ జయంతి రోజున..అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ లక్ష్యాలు, విధి, విధానాలను ప్రకటించారు. పలు కీలక ప్రకటనలు కూడా చేశారామె. ప్రతిపక్షాలు, అధికారపక్షాలపై విమర్శలు చేసిన షర్మిల.. పాదయాత్రపై కూడా ఓ ప్రకటన చేశారు. తాము కూడా రంగంలోకి దిగామని..ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ..ప్రతి జిల్లా..గ్రామాలకు వెళుతామని, ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ రోజు నుంచి సరిగ్గా వంద రోజులకు పాదయాత్ర మొదలు పెడుతామని షర్మిల ప్రకటించారు. అయితే ఆమె పార్టీ ఆవిర్భవించి నేటికి (ఆగస్టు 07)కు 30 రోజులు పూర్తయింది. అయితే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అక్టోబర్ 18వ తేదీన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.

    అంతేకాకుండా తన పార్టీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి తెస్తామో కూడా వివరించనున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ గా భావించే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ఆమె ఈ యాత్రను చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం 2012 లో పాదయాత్ర చేపట్టిన తేదీ కూడా అక్టోబర్ 18వ తేదీనే కావడం విశేషం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన ప్రాంతం, అటు జగన్ మోహన్ రెడ్డి కోసం షర్మిల యాత్ర చేపట్టిన తేదీ రెండూ కలిసిరావడం శుభసూచికంగా షర్మిల భావిస్తోంది. దీంతో తెలంగాణలో పాదయాత్రలు మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. ఇక ఈ పాదయాత్రలు మున్ముందు ఎలా వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.
    Published by:Veera Babu
    First published: