ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ వార్త జోరుగా షికార్లు చేస్తోంది. అదే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే తన అన్న వైఎస్ జగన్ తో విభేదించి పార్టీ పెడుతున్నారంటూ ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ కు భిన్నింగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే పార్టీ పెడుతున్నారన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ జోరుకు బ్రేక్ వేసేందుకే తెలంగాణలో పార్టీ పెడుతున్నారన్న చర్చ ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ఇతర పార్టీలకు వెళ్లకుండా కాపాడుకునేందుకు ఈ వ్యాహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. సెటిలర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో సీఎం కెసిఆర్ జగన్ తో సంప్రదించి షర్మిలతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని తెలుస్తోంది
అదే వ్యూహమా..?
తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. బిహార్ లో అనుసరించిన వ్యూహంతోనే ఇక్కడ టీఆర్ఎస్ కు చెక్క పెట్టాలని కమలనాథులు చూస్తున్నారు. ఇప్పుడు అదే వ్యూహంతో బీజేపీకి షాక్ ఇవ్వాలని కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అక్కడ చిరాగ్ పాశ్వాన్ ను బీజేపీ ప్రయోగించినట్లు.., ఇక్కడ షర్మిల అనే బాణాన్ని వదలాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఏపీకి చెందిన సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ మొత్తం మీద సుమారు 48 లక్షల సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. వీటిలో తొంబై శాతం మంది గ్రేటర్ హైదరాబాద్ లో నే ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లపై బీజేపీ ప్రభావం కనిపించింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ఓట్లలో చాలా వరకు బీజేపీ ఖాతాలో పడ్డాయి.. సెటిలర్ల ఓటు బ్యాంక్ పూర్తిస్థాయిలో బీజేపీ వైపు మొగ్గు చూపకుండా చేయాలనే వ్యూహంలో భాగంగానే షర్మిలతో కొత్త పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఐతే కొత్త పార్టీ పెడతారా.., లేక వైసీపీ తెలంగాణ శాఖను బలోపేతం చేస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది.

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
అక్కడా వైఎస్ అభిమానులు
జగన్ జైలులో ఉన్న సమయంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతల్లో షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పాదయాత్రకు మంచి స్పందనే వచ్చింది. 2014 ఎన్నికల్లో వైసీపీకి మూడు ఎమ్మెల్యే, ఓ ఎంపీ స్థానం దక్కింది. ఆ తర్వాత వీరంతా టీఆర్ఎస్ లో చేరినా వైసీపీ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేయలేదు. ఇప్పుడు అదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని వైసీపీని తెలంగాణలో రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ప్రస్తుతం నడుస్తోన్న టాక్. తెలంగాణలో బీజేపీకి దగ్గరవుతున్న ఓటర్లను వైసీపీ వైపు తిప్పుకొని టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేలా కేసీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీనిని అమల్లో పెట్టేందుకు జగన్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణకు తీసుకువెళ్లడం ద్వారా పార్టీకి ప్లస్ అవడమే కానీ మైనస్ అవదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సాధ్యమేనా..?
ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ ఓటు బ్యాంకకు ఒకింత గండిపడింది. ఇప్పుడు వైసీపీని తీసుకొస్తే గ్రౌండ్ రియాలిటీలో ఎవరి ఓట్లు చీలుతాయనేది ఎవరూ చెప్పలేరు. బహిరంగంగా పొత్తు ప్రకటిస్తే తప్ప ఇది సాధ్యపడదు. పోయిపోయి రాష్ట్రంలో మరో పార్టీని ప్రొత్సహిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. గతంలో వైసీపీని రాజకీయ పరంగా టీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో టీఆర్ఎస్ సృష్టించిన రణరంగం అంతా ఇంతా కాదు. కేసీఆర్-జగన్ మధ్య సఖ్యత వచ్చిందంటే రాష్ట్రాలు విడిపోవడంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం లేకపోవడమే. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. నీళ్లు, ఇతర విభజన పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాల కారణంగా ఇద్దరి మధ్య చెడితే పరిస్థితి మొదటికొచ్చినట్టే.