HOME »NEWS »POLITICS »ys sharmila to enter in telangana politics prn

AP, Telangana Politics: మళ్లీ రాజకీయాల్లోకి షర్మిల..? కేసీఆర్ సలహానే కారణమా..?

AP, Telangana Politics: మళ్లీ రాజకీయాల్లోకి షర్మిల..? కేసీఆర్ సలహానే కారణమా..?
మళ్లీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల?

వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి పంపాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోది.

 • Share this:
  వైఎస్ షర్మిల మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా..? గతంలో వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర నిర్వహిచిన ఆమెను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా..? షర్మిల పొలిటికల్ ఎంట్రీకి కేసీఆర్ కు సంబంధమేంటి..? ప్రస్తుతం తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి పంపాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోది. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుండటంతో ఆ ఓట్లను చీల్చేందుకు తెలంగాణలో వైసీపీని క్రీయాశీలకంగా మార్చాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

  అదే కారణమా..?


  తెలంగాణలో ఇప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులున్నారు. ఆ రాష్ట్రంలో వైసీపీ క్రియాశీలకంగా లేకపోవడం వైఎస్ అభిమానులంతా లోకల్ ట్రెండ్స్ ను బట్టి నడుచుకుంటున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రావడం, టీఆర్ఎస్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్లు తేలడంతో దీనికి అడ్డుకట్టవేసేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కు మంచి సఖ్యత ఉంది. దానినే ఆసరాగా తీసుకొని ఇప్పుడు వైసీపీని క్రియాశీలకం చేస్తే.. బీజేపీలో ఉన్న రెడ్డి ఓట్లు వైసీపీకి బదిలీ చేసుకోవచ్చు. అలాగే సెటిలర్ల ఓట్లపై పట్టు సాధించి.., టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యే అవకాశముందని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఓట్లు గంపగుత్తగా టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. వైఎస్ఆర్సీపీ.. టీఆర్ఎస్ కు మద్ధతుగా పనిచేయడంతోనే ఇది సాధ్యమైనట్లు రెండు పార్టీల్లో చర్చ నడుస్తోంది.

  అక్కడా వైఎస్ అభిమానులు
  జగన్ జైలులో ఉన్న సమయంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతల్లో షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పాదయాత్రకు మంచి స్పందనే వచ్చింది. 2014 ఎన్నికల్లో వైసీపీకి మూడు ఎమ్మెల్యే, ఓ ఎంపీ స్థానం దక్కింది. ఆ తర్వాత వీరంతా టీఆర్ఎస్ లో చేరినా వైసీపీ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేయలేదు. ఇప్పుడు అదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని వైసీపీని తెలంగాణలో రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ప్రస్తుతం నడుస్తోన్న టాక్. తెలంగాణలో బీజేపీకి దగ్గరవుతున్న ఓటర్లను వైసీపీ వైపు తిప్పుకొని టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేలా కేసీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీనిని అమల్లో పెట్టేందుకు జగన్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణకు తీసుకువెళ్లడం ద్వారా పార్టీకి ప్లస్ అవడమే కానీ మైనస్ అవదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  సాధ్యమేనా..?
  ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ ఓటు బ్యాంకకు ఒకింత గండిపడింది. ఇప్పుడు వైసీపీని తీసుకొస్తే గ్రౌండ్ రియాలిటీలో ఎవరి ఓట్లు చీలుతాయనేది ఎవరూ చెప్పలేరు. బహిరంగంగా పొత్తు ప్రకటిస్తే తప్ప ఇది సాధ్యపడదు. పోయిపోయి రాష్ట్రంలో మరో పార్టీని ప్రొత్సహిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. గతంలో వైసీపీని రాజకీయ పరంగా టీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో టీఆర్ఎస్ సృష్టించిన రణరంగం అంతా ఇంతా కాదు. కేసీఆర్-జగన్ మధ్య సఖ్యత వచ్చిందంటే రాష్ట్రాలు విడిపోవడంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం లేకపోవడమే. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. నీళ్లు, ఇతర విభజన పంపకాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాల కారణంగా ఇద్దరి మధ్య చెడితే పరిస్థితి మొదటికొచ్చినట్టే. ఐతే రాష్ట్రంలో తాము బలంగానే ఉన్నామని.. ఇక్కడ మరో పార్టీ అవసరం లేదని టీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని కొట్టిపారేస్తున్నారు. మరి పొలిటకల్ సర్కిల్స్ చక్కర్లు కొడుతున్న ఈ వార్త రియలా..? రూమరా..? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.
  Published by:Purna Chandra
  First published:December 12, 2020, 20:04 IST