YS Sharmila: అందుకే రాజకీయ పార్టీ పెడుతున్నా.. ఖమ్మం సభలో షర్మిల ప్రకటన

ఖమ్మం సభలో వైఎస్ఆర్ తరహాలోనే ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల

YS Sharmila Khammam Meeting: వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన ఏ ఒక్క పథకం, ప్రాజెక్టు సరిగ్గా అమలు కావడం లేదని షర్మిల అన్నారు

 • Share this:
  తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు వైఎస్ షర్మిల. తాను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన ఏ ఒక్క పథకం, ప్రాజెక్టు సరిగ్గా అమలు కావడం లేదని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ మొదలుపెట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్ పేరుతో మార్చారని.. అందులో అవినీతిని ప్రశ్నించడానికి రాజకీయ పార్టీ అవసరమని అన్నారు. తెలంగాంణలో రైతులుకు రుణమాఫీ అమలు కావడం లేదని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సరిగ్గా అమలు కావడం లేదని అన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నానో ఆమె వివరించారు. వైఎస్ఆర్ హయాంలో ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చారని.. ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని షర్మిల విమర్శించారు.

  తెలంగాణ ఏర్పడినా.. అందుకు తగ్గ ఆకాంక్షలు నెరవేరలేదని షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్‌కు కేసీఆర్‌కు పోలిక లేదని అన్నారు. కేసీఆర్ ఎప్పుడూ ప్రజలను కలవలేదని.. అసలు ఆయన సచివాలయానికే వెళ్లలేదని విమర్శించారు. వైఎస్ఆర్ ప్రతిరోజు కొన్ని వందల మందిని కలిసేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం దొరల కాళ్ల కింద నలిగిపోతోందని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని అన్నారు. దొర చెప్పిందే వేదం అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సాగుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఎవరని షర్మిల అన్నారు. అందుకే తాను రాజకీయ పార్టీ పెడుతున్నానని షర్మిల తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని షర్మిల విమర్శించారు. ఆ పార్టీ టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలను సరఫరా చేసే పార్టీగా మారిందని అన్నారు.

  తాను పెట్టబోయే పార్టీ తెలంగాణ ప్రజల కోసమే అని షర్మిల అన్నారు. ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని.. అందరికీ తాను అండగా ఉంటానని అన్నారు. తమకు రాజన్న ఇచ్చిన ధైర్యం ఉందని షర్మిల అన్నారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకొచ్చేందుకు, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైఎస్ఆర్ జయంతి అయిన జులై 8న కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నామని షర్మిల ప్రకటించారు. ఆ రోజు పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని అన్నారు. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఈ నెల 15 నుంచి మూడు రోజుల హైదరాబాద్‌లో తాను నిరాహార దీక్ష చేస్తానని షర్మిల తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలకు దిగుతారని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: