YS SHARMILA REDDY WILL ANNOUNCE NEW PARTY NAME AND FLAG DETAILS IN KHAMMAM MEETING FULL DETAILS HERE HSN
YS Sharmila Reddy: శుక్రవారం ఖమ్మం బహిరంగ సభలో షర్మిల ప్రకటించబోయే పార్టీ పేరు ఇదే.. అన్న జగన్ పార్టీలాగానే జెండాకు మూడు రంగులు..!
సభా ప్రాంగణంలో షర్మిల హోర్డింగ్స్
ఖమ్మం నగరంలో వైఎస్ షర్మిల శుక్రవారం బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలో పార్టీ పేరును, జెండాను, విధివిధానాలను ప్రకటించబోతున్నారు. అయితే షర్మిల పార్టీ పేరుపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి.
వైఎస్ షర్మిల. ఇప్పుడు ఈ పేరే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రికి కూతురు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోదరి అయిన ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి ఇప్పటికే అడుగు పెట్టేశారు. శుక్రవారం ఖమ్మం వేదికగా తన పార్టీ పేరును కూడా ప్రకటించబోతున్నారు. తెలంగాణ వచ్చి ఆరేళ్లవుతున్నా గతంలో రాజన్న అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? అంటూ ఇప్పటికే షర్మిల ప్రశ్నాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై వాగ్బాణాలు సంధించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించబోతున్న సంకల్ప సభలో నేరుగా అధికార టీఆర్ఎస్ పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో ఎవరైనా నేత కొత్తగా పార్టీ పెట్టబోతున్నారని తెలిస్తే.. వెంటనే ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో కాంగ్రెస్ ను విబేధించి కొత్త పార్టీని పెట్టుకున్న సమయంలో పార్టీ పేరు విషయంలో పెద్ద తర్జనభర్జనే జరిగింది. అయితే అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్(యువజన శ్రామిక రైతు కాంగ్రెస్) పేరుతో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఆ వ్యక్తిని ఒప్పించి ఆ పేరునే తమ కొత్త పార్టీ పేరుగా తీసుకున్నారు. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల వంతు వచ్చింది. ఆమె తన పార్టీకి ఏ పేరు పెట్టుకుంటారా? అని అంతటా ఆసక్తికర చర్చ చేస్తున్నారు.
వైఎస్ఆర్ ఇమేజ్ ను తెలంగాణలో తన పార్టీకి రాబట్టుకునేలా షర్మిల అడుగులు ఉంటున్నాయి. అందుకే ప్రతీ సమావేశంలోనూ రాజన్న ఉండి ఉంటే ఏఏ పథకాలు ఉండేవో వల్లె వేస్తూ వస్తున్నారు. అందుకే పార్టీ పేరులో కూడా వైఎస్ఆర్ అనే పేరు ఉండేలా షర్మిల నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే పార్టీ వర్గాల్లో మూడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. వైఎస్ఆర్ సీపీ లాగా.. వైఎస్ఆర్ టీపీ అని పిలుచుకునేలా సులువుగా ఉంటుందని, ప్రజల్లోకి బాగా వెళ్తుందని షర్మిల అభిమానులు భావిస్తున్నారు. పార్టీ జెండాను కూడా శుక్రవారం సభలోనే బయటకు వెల్లడిస్తారట. ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో పార్టీ జెండాను కూడా రూపొందించినట్టు సమాచారం. మరి బహిరంగ సభలో షర్మిల ఏం మాట్లాడతారో, పార్టీ పేరును ఏమని ప్రకటిస్తారో క్లారిటీగా తెలియాలంటే కొద్ది గంటలు వేచి ఉండాల్సిందే.