YS Sharmila Reddy: ఖమ్మంలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభకు కొత్త సమస్య.. కేసీఆర్ సర్కారు ఏం చేయబోతోంది..?

వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)

ఖమ్మంలో ఏప్రిల్ నెలలో వైఎస్ షర్మిల తలపెట్టిన భారీ బహిరంగ సభ రద్దు కాక తప్పదా? ఇటీవల మోదీ ఇచ్చిన సూచనలతో కేసీఆర్ సర్కారు ఏ నిర్ణయం తీసుకోబోతోంది. ఇంతకీ అసలు కథేంటంటే..

 • Share this:
  వైఎస్‌ షర్మిల ఖమ్మం బహిరంగ సభపై కరోనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు, దేశంలోని అనేక రాష్ట్రాల్లో రోజరోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతున్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ సత్వర నివారణ చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడి, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కానీ కోవిడ్‌-19 కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో ఎటువంటి నిర్లిప్తతకు చోటివ్వరాదంటూ సలహా ఇచ్చారు. వాస్తవానికి ఈనెల 22 నుంచి కళాశాలలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావించి ఆమేరకు ఆదేశాలు ఇచ్చినా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని పునరాలోచనలో పడింది.

  ఇప్పటికే 8వ తరగతి వరకు పాఠశాలలను మూసేయాలన్న ఆలోచన ఉన్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తాను రాజకీయ అరంగేట్రం చేయాలన్న తలంపుతో ఉన్న వైఎస్‌ షర్మిలకు పరిస్థితులు కలిసి వచ్చేలా కానరావడంలేదు. ఒకవేళ కరోనా వైరస్‌ విజృంభించి కేసులు పెరిగిన పక్షంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా నిబంధనలను విధించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే.. మరికొంత కాలం పాటు ఆగాల్సి రావొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపన దిశగా వడివడిగా అడుగులేస్తున్న వైఎస్‌ షర్మిల ఏప్రిల్‌ 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే సంబంధిత వర్గాల ద్వారా పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు.
  ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్

  బహిరంగసభ ఎక్కడ.. ఎలా నిర్వహించాలనే దానిపై ఇప్పటికే పలుమార్లు తనను కలిసిన జిల్లా నాయకులు, ముఖ్యమైన క్యాడర్‌తో వైఎస్‌ షర్మిల సుధీర్ఘంగా చర్చించారు. సభా వేదిక నిర్ణయించడానికి గానూ ఆమెకు అత్యంత విశ్వసనీయుడుగా పేరొందిన కొండా రాఘవరెడ్డి కొద్ది రోజుల క్రితం ఖమ్మం వచ్చారు. వేదిక కోసం స్థానికంగా ఉన్న నేతలు మూడు ప్రదేశాలను సూచించారు. శ్రీరామభక్త గెంటేల నారాయణరావు డిగ్రీ కళాశాల మైదానం (ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌), సర్దార్‌ పటేల్‌ స్టేడియం, పెవిలియన్‌ మైదానంలను రాఘవరెడ్డి పరిశీలించారు. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోడానికి వివరాలను తీసుకుని వెళ్లారు. కనీసం లక్ష మందికి తగ్గకుండా సభను భారీగా, విజయవంతంగా నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్‌ షర్మిల సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఇప్పటికే బాధ్యతలను ఇచ్చేసినట్టు కూడా చెబుతున్నారు.

  ఖమ్మం జిల్లాతో తనకు, తన కుటుంబానికి, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి ఆమె ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి నిత్యం లోటస్‌ పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిసే వారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉండడం కూడా ఆమె ఆసక్తికి కారణం కావొచ్చని చెబుతున్నారు. వారం క్రితం ఐదొందల మందితో చిట్‌చాట్‌ కార్యక్రమం నిర్వహించగా.. మళ్లీ శుక్రవారం నాడు ఖమ్మం నుంచి నూటయాభై వాహనాలలో వందలాది మంది హైదరాబాద్‌ వెళ్లి మరీ వైఎస్‌ షర్మిలను కలిశారు. ఇలా ప్రతి జిల్లా వాసులతోనూ ప్రత్యేకంగా భేటీ అవుతున్న షర్మిల.. ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఓ ప్రత్యేకమైన రెస్పాన్స్‌ రావడం పట్ల ఆమె మరింత ఉత్సాహాన్ని చూపుతున్నట్టు చెబుతున్నారు.
  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

  రెండు రోజుల క్రితం మధిర మున్సిపల్‌ వైఎస్‌ ఛైర్మన్‌ శీలం విద్యాలత తెరాసకు రాజీనామా చేసి మరీ వైఎస్‌ షర్మిల పెట్టబోయే పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడం.. దాదాపు నాలుగున్నరేళ్ల పదవీకాలాన్ని వదిలేసి, అధికార పార్టీ నుంచి బయటకు రావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. దీంతో ఇంకా పేరు కూడా వెల్లడి కాని పార్టీ పట్ల భారీ అంచనాలే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ బిల్డర్‌, ఖమ్మం సిటీ బిల్డర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తుంపాల కృష్ణమోహన్‌ తన అనుచర వర్గంతో ప్రత్యేకంగా వైఎస్‌ షర్మిలతోనూ, ఆనక బ్రదర్‌ అనిల్‌తోనూ భేటీ అయ్యారు. క్రిస్టియన్‌ వర్గాలలో ప్రాబల్యం ఉన్న కృష్ణమోహన్‌కు బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారు. దీంతో అన్నివర్గాలలోనూ స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు.

  అనుకున్నట్టు బహిరంగసభను విజయవంతం చేస్తే భారీగానే చేరికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీనికితోడు కొద్ది రోజుల క్రితం రఘునాథపాలెం మండలం శివాయగూడెం మెయిన్‌రోడ్డులో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం శనివారం తెల్లవారుజామున మరో విగ్రహాన్ని జేసీబీతో ధ్వంసం చేయడం పట్ల వైఎస్‌ షర్మిల మద్దతుదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రాస్తోరోకో చేశారు.

  కరస్పాండెంట్‌- జి.శ్రీనివాసరెడ్డి

  Published by:Hasaan Kandula
  First published: